యూఎస్ ఓపెన్‌లో పెను సంచలనం నమోదైంది. స్పెయిన్ యువ సంచలనం 19ఏళ్ల కార్లోస్ అల్కరాజ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. న్యూయార్క్ వేదికగా ఆదివారం అర్ధరాత్రి జరిగిన యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో నార్వే క్రీడాకారుడు కాస్పర్ రూడ్‌ను ఓడించి తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను అల్కరాజ్ కైవసం చేసుకున్నాడు. రెండున్నర గంటలపాటు సాగిన హోరాహోరీగా పోరులో 6-4, 2-6, 7-6(7-1), 6-3 తేడాతో అల్కరాజ్ విజయం సాధించాడు. దీంతో వరల్డ్ నంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. తద్వారా రఫెల్ నాదల్ తర్వాత 19ఏళ్లకే తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను సాధించిన అత్యంత పిన్నవయస్కుడిగా అల్కరాజ్ నిలిచాడు. 2005లో రఫెల్ నాదల్ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను సొంతం చేసుకుని ఈ ఘనత సాధించాడు. అదే విధంగా అతి తక్కువ వయస్సు(19ఏళ్లు)లోనే వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్ సాధించిన తొలి ఆటగాడిగా కూడా అల్కరాజ్ నిలిచాడు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే… హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో విజయం కోసం ఇద్దరూ తీవ్ర కృషి చేశారు. ఎక్కడా ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా తలపడ్డారు. ఈ క్రమంలో అల్కరాజ్ 6-4తేడాతో తొలి సెట్‌ను గెలుచుకున్నాడు. అయితే రెండో సెట్‌లో రూడ్ విజృంభించాడు. ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి 4-2తో ఆధిక్యంలో నిలిచాడు. అదే ఊపులో 6-2 తేడాతో ఆ సెట్‌ను కైవసం చేసుకొని సమంగా నిలిచాడు. ఇక మూడో సెట్‌లో విజయం కోసం ఇద్దరూ కఠోర శ్రమ చేశారు. తొలుత ఆధిక్యంలోకి రూడ్ దూసుకెళ్లగా, అనంతరం అల్కరాజ్ ఒత్తిడిని అధిగమించి స్కోర్‌ను 6-6తో సమం చేయడంతో ఈసెట్ టైబ్రేకర్‌కు మళ్లింది. ఇందులో 7-1 (7-6)తేడాతో అల్కరాజ్ నెగ్గాడు. ఇక కీలకమైన నాలుగో సెట్‌లో రూడ్ చేతులెత్తేశాడు. అల్కరాజ్ తన ఆధిపత్యాన్ని నిలుపుకుంటూ 6-3తేడాతో తొలిసారి యూఎస్ ఓపెన్ కిరీటంతోపాటు ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు.
మరెన్నో టైటిళ్లు గెలుస్తావు
”కెరీర్‌లో మొట్టమొదటి గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచినందుకు, వరల్డ్ నంబర్‌వన్‌గా అవతరించినందుకు శుభాకాంక్షలు. ఈ సీజన్‌ను ఎంతో గొప్పగా సాగించావు… ఈ సీజన్‌కు అద్భుతమైన ముగింపునిచ్చావు. నువ్వు ఇలాంటివే మరెన్నో టైటిళ్లు గెలుస్తావని కచ్చితంగా చెప్పగలను”
-రఫేల్ నాదల్ ట్వీట్