చీప్ సెలక్టర్ ఆగార్కర్ వివరణ
అదనపు స్పిన్నర్ కోసం రింకూ త్యాగం
హర్ధిక్ పై నమ్మకం ఉంచాం..
సంజూకి ఫినిషర్ గా స్థానం
అదనపు స్పిన్ ఆప్షన్ కోసమే విధ్వంసకర బ్యాటర్ రింకూ సింగ్‌ను భారత ప్రపంచకప్ ప్రధాన జట్టులోకి తీసుకోలేదని బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ అన్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ ఇద్దరు మణికట్టు స్పిన్నర్లు కావాలనడంతో రింకూ సింగ్‌ను రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపిక చేయాల్సి వచ్చిందని స్పష్టం చేశాడు.
జూన్ 1 నుంచి 29 వరకు అగ్రరాజ్యం అమెరికా, వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ 2024 జరగనుంది. ఇప్పటికే ఈ టోర్నీలో పాల్గొనే ఆయా జట్లను క్రికెట్ బోర్డులు ప్రకటించాయి.
15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ మంగళవారం(ఏప్రిల్ 30) ప్రకటించింది. ప్రపంచకప్ జట్టులో ఉంటాడనుకున్న టీమిండియా నయా ఫినిషర్ రింకూ సింగ్‌కు సెలెక్టర్లు మొండి చెయ్యి చూపించారు. రిజర్వ్ ఆటగాడిగా ఎంపిక చేశారు. రింకూ సింగ్‌ను ఎంపిక చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. భారీ మాజీ క్రికెటర్లు సెలెక్టర్ల తీరును తప్పుబట్టారు.
ఎక్స్ట్రా స్పిన్నర్ కోసమే..
ఈ టీ20 ప్రపంచకప్ జట్టు ఎంపికకు సంబంధించి భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జట్టు ఎంపికపై ఉన్న సందేహాలన్నింటికి సమాధానమిచ్చారు. రింకూ సింగ్‌ను ఎంపిక చేయకపోవడానికి గల కారణాలను కూడా వివరించారు. అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. ఎక్స్ట్రా స్పిన్ ఆప్షన్ కోసమే రింకూ సింగ్‌ను పక్కనపెట్టాల్సి వచ్చిందన్నాడు.
‘రింకూ సింగ్‌ను ఎంపిక చేయకపోవడం కఠినమైన నిర్ణయం. ఇందులో రింకూ సింగ్ తప్పిదం ఏ మాత్రం లేదు. రోహిత్ శర్మ ఎక్స్ట్రా స్పిన్ ఆప్షన్ కావాలన్నాడు. ఇద్దరు మణికట్టు బౌలర్లతో పాటు మరో స్పిన్నర్‌ను తీసుకోవాలని చెప్పాడు. దాంతోనే రింకూ సింగ్ రిజ్వర్ ఆటగాళ్ల జాబితాలో ఉండాల్సి వచ్చింది.’అని అగార్కర్ చెప్పుకొచ్చాడు.
మిడిలార్డ్ బలోపేతం చేసేందుకే..
మిడిలార్డర్ బలాన్ని పెంచాలనే శివమ్ దూబేను తీసుకున్నామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ఐపీఎల్‌తో పాటు అంతకుముందు భారత్ తరఫున అతను కనబర్చిన ప్రదర్శనను పరిగణలోకి తీసుకొని ఎంపిక చేశామని చెప్పాడు. అయితే తుది జట్టులో ఆడుతాడనే గ్యారంటీ లేదని, అక్కడి పిచ్ కండిషన్స్ ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపాడు. జట్టులో నలుగురు స్పిన్నర్లు ఉండాలనుకున్నానని, ఇప్పుడు అందుకు గల కారణాన్ని చెప్పలేనని రోహిత్ స్పష్టం చేశాడు. నలుగురు స్పిన్నర్ల వెనుక ఉన్న వ్యూహాన్ని అమెరికాలోనే చెబుతానని సమాధానమిచ్చాడు. ఇక విరాట్ కోహ్లీ స్ట్రైక్‌రేట్‌కు సంబంధించి తమ మధ్య ఎలాంటి చర్చ జరగలేదని, అతను అద్భుతంగా ఆడుతున్నాడని, అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదని అగార్కర్ అన్నాడు.