అఫ్గానిస్తాన్ పేసర్ నవీన్ ఉల్ హక్‌కు భారీ షాక్ తగిలింది. దుబాయ్ వేదికగా జరిగే ఐఎల్‌టీ20 లీగ్ (ఇంటర్నేషనల్ టీ20 లీగ్) అతడిపై 20 నెలల పాటు నిషేదాన్ని విధించింది. ఈ లీగ్‌లో నవీన్ ఉల్ హక్ షార్జా వారియర్స్ తరుపున ఆడుతున్నాడు. అయితే.. ప్రాంఛైజీతో నవీన్ చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు లీగ్ మేనేజ్‌మెంట్ తెలిపింది. ఈ క్రమంలోనే అతడిపై 20 నెలల పాటు నిషేదం విధిస్తున్నట్లు పేర్కొన్నది.
నవీన్ ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఐఎల్‌టీ20 మొదటి సీజన్‌లో షార్జా వారియర్స్ తరుపున ఆడాడు. ఇక ముందస్తు ఒప్పందంలో భాగంగా సీజన్ 2లో ఆడతానని సంతకం చేయాలని ప్రాంఛైజీ అతడిని కోరింది. అయితే.. ఆ అగ్రిమెంట్‌లో సంతకం చేసేందుకు అతడు నిరాకరించాడు. దీంతో షార్జా వారియర్స్ జట్టు మేనేజ్‌మెంట్ ఐఎల్‌టీ20 క్రమశిక్షణా కమిటీకి ఫిర్యాదు చేసింది. దీనిపై ఐఎల్‌టీ20 క్రమశిక్షణా కమిటీ విచారణ చేపట్టింది. అప్పటికీ కూడా అతడు సంతకం చేసేందుకు నిరాకరించడంతో నవీన్‌పై 20 నెలల నిషేధం విధించింది. ఈ నిషేదం కారణం నవీన్ రెండు సీజన్ల పాటు ఐఎల్‌టీ20 లో ఆడేందుకు అవకాశం లేదు.