ప్రపంచకప్ టోర్నిలో పాక్ వైపల్యానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వైఖరిని తప్పుపడుతూ క్రికెట్‌తో ఏ సంబంధం లేని బాలీవుడ్ నటి, మాజీ విశ్వసుందరి ఐశ్వర్య రాయ్‌ని మధ్యలోకి లాగాడు పాక్ క్రికెటర్ అబ్దుల్ రజాక్. పాక్ మాజీ క్రికెటర్లు షాహిది ఆఫ్రిది, ఉమర్ గిల్, అబ్దుల్ రజాక్ మధ్య తాజాగా మీడియా ఇంటరాక్షన్ జరగ్గా.. పాకిస్థాన్ జట్టు ఇటీవలి ప్రదర్శనల గురించి చర్చ మొదలైంది. ఈ చర్చలో భాగంగా అబ్దుల్ రజాక్ హద్దులు దాటాడు. ఐశ్వర్య రాయ్‌ను తాను పెళ్లి చేసుకుంటే అందమైన, పవిత్రమైన పిల్లలు పుడుతారనుకుంటే పొరబడినట్లే? అని రజాక్ పేర్కొన్నాడు.
‘అప్పటి కెప్టెన్ యూనిస్ ఖాన్ మెరుగైన ప్రదర్శన చేస్తాడని నాకు నమ్మకం ఉండేది. జట్టులోని ప్లేయర్స్ అందరం అదే అనుకున్నాం. ఇప్పుడు మాత్రం మంచి ఆటగాళ్లను తయారుచేయాలని కానీ, పాక్‌లో క్రికెట్‌ను మెరుగుపర్చాలని కానీ పాకిస్తాన్ బోర్డుకు లేదు. పాక్ బోర్డుకు సంకల్ప బలమే లేదు. అలాంటప్పుడు ఫలితాలు ఎలా వస్తాయి. నేను ఐశ్వర్య రాయ్‌ను పెళ్లి చేసుకోవడం వల్ల అందమైన, పవిత్రమైన పిల్లలు పుడతారని అనుకుంటే.. అది ఎప్పటికీ జరగదు. ఇదీ అంతే. బోర్డు సంకల్పం బలంగా ఉంటేనే ఏదైనా సాధ్యం అవుతుంది’ అని అబ్దుల్ రజాక్ ఉదహరించాడు.
అబ్దుల్ రజాక్ చేసిన వ్యాఖ్యలపై మాజీ కెప్టెన్ షాహిది ఆఫ్రిది చప్పట్లు కొట్టాడు. రజాక్ వ్యాఖ్యలు సరైనవే అని అంగీకరించాడు. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. రజాక్ వ్యాఖ్యలపై భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. రజాక్ క్రికెట్ గురించి మాట్లాడకుండా మధ్యలో ఐశ్వర్య రాయ్‌ని ఎందుకు లాగాడు అని కామెంట్లు పెడుతున్నారు. రజాక్ రోజురోజుకు మరింతగా దిగజారిపోతున్నాడని నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. వెంటనే ఐశ్వర్యరాయ్ కి క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు.