Friday, October 4, 2024

Mumbai | ఒకేసారి లక్ష మంది వీక్షించేలా.. ఆర్థిక రాజ‌ధానిలో కొత్త క్రికెట్ స్టేడియం

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కొత్త క్రికెట్ స్టేడియం రూపుదిద్దుకోనుంది. వాంఖడే స్టేడియానికి 68 కి.మీ దూరంలో దీనిని నిర్మించనున్నారు. థానే నగరానికి 26 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమనే గ్రామంలో 50 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో, ఒకేసారి లక్ష మంది కూర్చొని వీక్షించేలా స్టేడియాన్ని నిర్మించనున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.

స్టేడియం నిర్మాణానికి అవసరమైన భూమిని సేకరించేందుకు మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎంఎస్‌ఆర్‌డిసి) ఇప్పటికే ప్రణాళికలు మొదలు పెట్టింది. ఓపెన్ టెండర్లను ఆహ్వానించింది. ఈ ప్రాజెక్టు కొరకు మహారాష్ట ప్రభుత్వ అనుమతి కోసం నగర క్రికెట్ పాలక మండలి ఎదురుచూస్తోంది.

ఇటీవల మరణించిన ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అమోల్ కాలే కలల ప్రాజెక్ట్ ఈ స్టేడియం నిర్మాణం అన్న మాటలు వినపడుతున్నాయి. ఆర్థిక రాజధాని ముంబైలో ఇప్పటికే వాంఖడే స్టేడియం కాకుండా మరో రెండు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాలు ఉన్నాయి.

వాంఖడే స్టేడియం సామర్థ్యం 33వేలు కాగా, బ్రబౌర్న్ స్టేడియం 20,000 మందికి ఆతిథ్యం ఇవ్వగలదు. ఇక, నావీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియం 45,000 మంది కూర్చొనే సామర్థ్యం కలదు. అయిన‌ప్ప‌టికీ గుజ‌రాత్ స్టేడియం త‌ర‌హాలో మ‌రో స్టేడియం నిర్మాణానికి ముంబై క్రికెట్ అసోసియేష‌న్ త‌మ వంతు ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement