( ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో) : ముఖ్యమంత్రి ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే సమగ్ర క్రీడా విధానాన్ని తేనున్నట్లు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ అనిమిని రవి నాయుడు వెల్లడించారు.
శాప్ ఛైర్మన్ రవి నాయుడు మంగళవారం ఇందిరాగాంధీ మునిసిపల్ స్డేడియం కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. క్రీడా ప్రతిభను ప్రోత్సహించి, అత్యుత్తమ శిక్షణ అందించి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించేలా కార్యాచరణతో క్రీడా విధానం రూపకల్పనకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు.
గత అయిదేళ్లలో రాష్ట్రంలో క్రీడా వ్యవస్థను సర్వనాశనం చేశారని.. క్రీడారంగాన్ని 20 ఏళ్లు వెనక్కు తీసుకెళ్లారన్నారు. దాదాపు రూ. 119 కోట్లతో ఆడుదాం.. ఆంధ్రా అంటూ క్రీడలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారని విమర్శించారు. ఆ డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో బయటడతామని.. నిర్దిష్ట ప్రణాళికతో అక్రమాలను వెలికితీసి చట్టపరంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
2014-19లో ముఖ్యమంత్రి హయాంలో క్రీడా వికాస కేంద్రాలు, ఇండోర్, అవుట్‌డోర్ స్టేడియాలు, మల్టీపర్పస్ స్టేడియాలతో క్రీడాభివృద్ధికి కృషిచేయడం జరిగిందని.. అయితే తర్వాత కాలంలో 80-90 శాతం మేర పూర్తయిన క్రీడా వికాస కేంద్రాలను సైతం మిగిలిన పనులు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురాకుండా నిర్లక్ష్యం చేశారన్నారు.
నెల్లూరులోని స్పోర్ట్స్ విలేజ్‌విషయంలోనూ అదే నిర్లక్ష్యం కనిపించిందన్నారు. ఆర్థికంగా ఇబ్బందులున్నప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి చొరవతో రాష్ట్రాన్ని క్రీడల పరంగా అభివృద్ది చేస్తామని.. రాష్ట్రంలో జాతీయ క్రీడలను నిర్వహించాలనేది ఆయన లక్ష్యమని.. ఇందుకు సంబంధించి ఇప్పటికే మౌలిక వసతుల కల్పనపై ఆదేశాలిచ్చారన్నారు.
ఈ విషయంలో మంత్రి, ఛైర్మన్, డైరెక్టర్, సెక్రటరీ అందరూ ఒక జట్టుగా కృషిచేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే క్రీడా సంఘాలతో మాట్లాడామని.. వారి సలహాలు, సూచనలు కూడా తీసుకుంటామన్నారు. గతంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ఖేలో ఇండియా ప్రాజెక్టులు, నిధులపై ప్రస్తుతం ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు తెలిపారు.
మారుమూల పల్లెలోని ప్రతిభను సైతం గుర్తించి, ప్రోత్సహిస్తామన్నారు. కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్.. ఇలా ఏ క్రీడలోనైనా ప్రతిభను ప్రోత్సహించి, నాణ్యమైన శిక్షణ అందేలా చూస్తామన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం హయాంలో కోచ్‌లకు గౌరవం తెచ్చేలా త్వరలో నిర్ణయాలు ప్రకటిస్తామన్నారు.
కాంట్రాక్టర్ల చేతుల్లోని ఇండోర్, అవుట్‌డోర్ స్టేడియాలను హ్యాండోవర్ చేసుకుంటున్నామని.. ఇప్పటికే 70 శాతం ప్రక్రియ పూర్తయిందని వివరించారు. ఒలింపిక్స్‌లో మెడల్స్ ద్వారా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు తేవొచ్చని.. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు, ఎన్నారైలు, క్రీడల ద్వారా ఉన్నతస్థానాలకు వెళ్లినవారు కూడా కలిసి రావాలని పిలుపునిచ్చారు. అదే విధంగా ఫేక్ సర్టిఫికేట్లను సహించేది లేదని.. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, డిజిటల్ సర్టిఫికేషన్‌పైనా చర్చలు కొనసాగుతున్నట్లు రవి నాయుడు తెలిపారు.