సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య దక్షిణాఫ్రికా చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసిన టీమిండియా రెండో టెస్టు కోసం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే గాయంతో తొలి టెస్టుకు దూరమైన సీనియర్ పేసర్ మహ్మద్ షమీ స్థానంలో యువ పేసర్ అవేష్ ఖాన్కు భారత సెలెక్టర్లు ఎంపిక చేశారు. షమీ ఇంకా కోలుకోక పోవడంతో అతని స్థానంలో రైటార్మ్ పేసర్ అవేష్కు చోటు కల్పించినట్టు భారత సెలక్టర్లు శుక్రవారం అధికారికంగా ప్రకటించారు.
అవేష్ ఖాన్ తొలిసారి భారత టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు. 27 ఏళ్ల మధ్యప్రదేశ్ పేసర్ అవేష్ ఖాన్ ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో 6 వికెట్లు పడగొట్టి సత్తా చాటుకున్నాడు. కాగా గత ఏడాదే పరిమిత ఓవర్ల క్రికెట్లో అడుగుపెట్టిన ఖాన్ టీమిండియా తరఫును 8 వన్డేలు, 19 టీ20లు ఆడి 27 వికెట్లు పడగొట్టాడు.