అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్న వన్డే ప్రపంచకప్‌కు ముందు పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు పెద్ద షాక్ తగిలింది. ఆ జట్టు ప్రధాన పేసర్ నసీం షా వన్డే ప్రపంచకప్‌కు దూరం కానున్నాడని తెలుస్తోంది. టీమిండియాతో జరిగిన సూపర్ 4 మ్యాచ్ సందర్భంగా గాయపడిన నసీం ఆ తర్వాత బ్యాటింగ్ చేసేందుకు కూడా రాలేదు. అనంతరం శ్రీలంకతో జరిగిన కీలక మ్యాచ్‌లోనూ అతను ఆడలేదు.
దాంతో అతని భుజం గాయం తీవ్రత అధికంగా ఉందని తెలస్తోంది. ప్రస్తుతం పీసీబీ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్న నసీం షా గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి ఇంకా నెల సమయం పడుతుందని సమాచారం. దాంతో వన్డే ప్రపంచకప్ ఆరంభపు మ్యాచుల్లో షా దూరం కానున్నాడు. టీమిండియా మ్యాచ్‌లోనే గాయపడిన మరో పేసర్ హరీస్ రవూఫ్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు.
వన్డే ప్రపంచకప్‌కి అతను అందుబాటులో ఉంటాడని తెలుస్తుంది. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో అఘా సల్మాన్, శ్రీలంక మ్యాచ్‌లో ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ గాయపడ్డారు. ప్రస్తుతం పాక్ ప్లేయర్లు గాయాలతో సతమతమవుతున్న పాక్ గురువారం శ్రీలంకతో జరిగిన కీలక పోరులో చివరి బంతికి ఓడి ఆసియాకప్ నుంచి వైదొలిగింది.