Saturday, November 16, 2024

KCA | ఒకే మ్యాచ్‌లో 3 సూపర్ ఓవర్లు.. క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి..

కర్ణాటక క్రికెట్ అసోసియేషన్(కేసీఏ) ఆధ్వర్యంలో జరుగుతున్న మహారాజా టీ20 ట్రోఫీలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. క్రికెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ఓ మ్యాచ్ జరిగింది. మూడు సూపర్ ఓవర్లతో ఈ మ్యాచ్ ఫలితం తేలింది. భారత క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు రెండు సూపర్ ఓవర్లే జరిగాయి. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ అరుదైన సంఘటన చోటు చేసుకుంది.

తాజాగా మహారాజా ట్రోఫీలో భాగంగా హుబ్లీ టైగర్స్, బెంగళూరు బ్లాస్టర్స్ మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్ ఫలితం మూడు సూపర్ ఓవర్లతో తేలింది. చివరకు ఈ మ్యాచ్‌లో హుబ్లీ టైగర్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన హుబ్లీ టైగర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 164 పరుగులు చేసింది. కెప్టెన్ మనీష్ పాండే(22 బంతుల్లో 3 సిక్స్‌లతో 33)రాణించాడు. అనంతరం బెంగళూరు బ్లాస్టర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 164 పరుగులకు కుప్పకూలింది. దాంతో స్కోర్లు టై అయ్యాయి.

ఫలితం తేల్చడం కోసం తొలి సూపర్ ఓవర్ ఆడించగా.. బెంగళూరు బ్లాస్టర్స్ వికెట్ నష్టానికి 10 పరుగులు చేసింది. కెప్టెన్ మయాంక్ అగర్వాల్(0) గోల్డెన్ డక్ అవ్వగా.. అనిరుద్ జోషీ 8 పరుగులు చేశాడు. అనంతరం టైగర్స్ 10 పరుగులే చేయడంతో మళ్లీ స్కోర్లు టై అయ్యాయి. రెండో సూపర్ ఓవర్‌లో హుబ్లీ టైగర్స్ 8 పరుగులు చేయగా.. బెంగళూరు బ్లాస్టర్స్ కూడా 8 పరుగులే చేసింది. దాంతో మరోసారి స్కోర్లు టై అయ్యి.. మూడో సూపర్ ఓవర్ ఆడించాల్సి వచ్చింది.

చివరి సూపర్ ఓవర్‌లో బెంగళూరు బ్లాస్టర్స్ 12/1 పరుగులు చేసింది. హుబ్లీ టైగర్స్ 13 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ఈ మ్యాచ్ ఇరు జట్ల ఆటగాళ్లతో పాటు అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేసింది. అసాధారణ మ్యాచ్‌గా చరిత్రకెక్కింది. 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్ అనంతరం సూపర్ ఓవర్ల విషయంలో ఐసీసీ నిబంధనలు మార్చిన విషయం తెలిసిందే.

న్యూజిలాండ్‌తో జరిగిన నాటి ఫైనల్లో ఇంగ్లండ్ బౌండరీల సంఖ్య అనే అసంబద్దమైన నిబంధనతో విజేతగా నిలిచి ప్రపంచకప్ కైవసం చేసుకుంది. అప్పట్లో ఈ రూల్‌పై తీవ్ర విమర్శలు రాగా.. కటాఫ్ సమయంలోపు ఫలితం తేలే వరకు సూపర్ ఓవర్ ఆడించాలని స్పష్టం చేసింది. దాంతోనే మహారాజా టీ20 ట్రోఫీలో ఫలితం కోసం మూడు సూపర్ ఓవర్లు ఆడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement