Friday, October 18, 2024

ACA | అమ‌రావ‌తిలోనే 2027 నేష‌న‌ల్ గేమ్స్ : ఎంపి కేశినేని

(ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో) : ఆంధ్ర‌ప్ర‌దేశ్ త‌రుఫున అమ‌రావ‌తి రాజ‌ధాని ప్రాంతంలో 2027లో నేష‌న‌ల్ గేమ్స్ నిర్వ‌హించేందుకు సీఎం చంద్ర‌బాబు నాయుడు కృషి చేస్తున్నార‌ని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ అన్నారు. ఆచార్య నాగార్జున యూనివ‌ర్శిటీలో గురువారం 35వ సౌత్ జోన్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ -2024 గేమ్స్ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మం జ‌రిగింది.

ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్యఅతిథిగా ఆంధ్ర‌క్రికెట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు, ఎంపికేశినేని శివ‌నాథ్, ఎమ్మెల్యే దూళిపాళ్ల న‌రేంద్ర‌, శాప్ చైర్మ‌న్ ర‌వినాయుడుతో క‌లిసి పాల్గొన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అథ్లేటిక్స్ అసోసియేష‌న్ ప‌త‌కాన్ని ఎంపి కేశినేని శివ‌నాథ్ ఆవిష్క‌రించి క్రీడాకారుల గౌర‌వ వంద‌న స్వీక‌రించారు.

అనంత‌రం 35వ సౌత్ జోన్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ -2024 క్రీడ‌ల‌ను ప్రారంభిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించి అతిథుల‌తో క‌లిసి బెలున్స్ గాలిలోకి వ‌దిలిపెట్టారు. ఈ సంద‌ర్బంగా ఎసిఏ అధ్యక్షుడు, ఎంపి కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ…

సీఎం చంద్ర‌బాబు నాయుడు క్రీడ‌ల‌ను ప్రోత్స‌హించ‌టానికి ఎప్పుడు ముందు వుంటార‌న్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వ‌ర్యంలో డిసెంబ‌ర్ నుంచి జ‌న‌వ‌రి వ‌ర‌కు ప్ర‌తి గ్రామంలో క్రీడా సంబరాలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు.

ఈ క్రీడా సంబ‌రాల వ‌ల్ల గ్రామీణ ప్రాంతంలోని ప్ర‌తిభ గ‌ల క్రీడాకారులు వెలుగులోకి తీసుకురావాల‌నే ఉద్దేశ్యంతో ఈ క్రీడా సంబ‌రాలు ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్ర‌తి స్టేడియాన్ని శాప్ త‌రుఫున డెవ‌ల‌ప్ చేసేందుకు ప్ర‌ణాళిక సిద్దం చేసిన‌ట్లు తెలిపారు. మంగ‌ళ‌గిరి లోని అంత‌ర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని ఏడాదిన్న‌ర లోపు అందుబాటులోకి తీసుకువ‌స్తామ‌ని చెప్పారు.

- Advertisement -

ఆ స్టేడియంలోనే క్రీడాకారులంద‌రికీ ఉప‌యోగ ప‌డే విధంగా స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేయ‌నున్నట్లు ప్ర‌క‌టించారు. అలాగే చిన్న‌పిలల్లో క్రీడ‌ల ప‌ట్ల ఆస‌క్తి పెంచాల్సిన అవ‌స‌రం వుంద‌న్నారు. పిల్ల‌ల‌కి చ‌దువుతో పాటు క్రీడాల్లో కూడా రాణించే విధంగా తీర్చిదిద్దాల‌న్నారు.

క్రీడ‌ల ప‌ట్ల పిల్ల‌ల‌కి ఆస‌క్తి పెరిగితే ఇంట‌ర్ నెట్, సోష‌ల్ మీడియాకి దూరంగా వుంటార‌ని తెలిపారు. క్రీడ‌ల‌పై పిల్ల‌ల‌కి ఆస‌క్తి పెంచితే పోటీత్త‌త్వం పెరుగుతంద‌న్నారు. సీఎం చంద్ర‌బాబు నాయుడు క్రీడ‌ల‌ను ప్రోత్స‌హించ‌టానికి ఎప్పుడు ముందుంటారు. క్రీడాకారుల నైపుణ్యాల‌ను అభివృద్ది చేసేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం కంక‌ణం క‌ట్టుకుంద‌న్నారు.

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ గా వున్న స‌మ‌యంలో హైద‌రాబాద్ లో ముఖ్య‌మంత్రి గా చంద్ర‌బాబు నాయుడు ఏఫ్రో ఆసియ‌న్ గేమ్స్, నేష‌న‌ల్ గేమ్స్ తీసుకు రావ‌ట‌మే కాదు. తొమ్మిది స్టేడియాలు నిర్మించటంతో పాటు ఒక స్పోర్ట్ సిటీ కూడా నిర్మించారు. అదే విధంగా అమ‌రావ‌తిలో స్పోర్ట్స్ సిటీ నెల‌కొల్పి క్రికెట్ తో పాటు అన్ని స్పోర్ట్స్ ను ప్రోత్స‌హిస్తామ‌ని చెప్పారు.

శాప్ చైర్మ‌న్ ర‌వినాయుడు, ఎమ్మెల్యే దూళిపాళ్ల న‌రేంద్ర మాట్లాడుతూ గ‌త ప్ర‌భుత్వం క్రీడ‌ల‌ను, క్రీడాకారుల‌ను నిర్ల‌క్ష్యం చేసింద‌న్నారు. రాష్ట్రంలో అసంపూర్తిగా వ‌దిలేసిన క్రీడా వికాస కేంద్రాల‌ను అభివృద్ది చేస్తామ‌న్నారు. క్రీడాకారుల‌కి మెరుగైన వ‌స‌తులు క‌ల్పించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం కృషి చేస్తుంద‌న్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో వైస్ చైర్మ‌న్-మేనేజింగ్ డైరెక్ట‌ర్ ఆఫ్ శాప్ పి.ఎస్.గిరీష్ , వైస్ చాన్స‌ల‌ర్ ఎస్.ఆర్.ఎమ్. యూనివ‌ర్శిటీ మ‌నోజ్ కె అరోర‌, వైస్ చాన్స‌ల‌ర్ ఆచార్య‌ నాగార్జున యూనివ‌ర్శిటీ ప్రొ.కె.గంగాధ‌ర‌రావు, రెక్టార్ ఆచార్య‌ నాగార్జున యూనివ‌ర్శిటీ కె.ర‌త్న‌షీలా మ‌ణి, రిజిస్ట్రార్ ఆచార్య నాగార్జున యూనివ‌ర్శిటీ ప్రొ.జి.సింహాచ‌లం ల‌తో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement