Thursday, November 21, 2024

ఇంగ్లండ్‌కు 100శాతం మ్యాచ్‌ఫీజు.. 5 డబ్ల్యూటీసీ పాయింట్ల కోత.. స్లో ఓవర్‌ రేట్‌ కారణం..

ఇంగ్లండ్‌ ఐదు ఓవర్లు నిర్ణీత సమయం కంటే స్లోగా వేసింది. దీంతో మ్యాచ్‌ ఫీజుపై 100శాతం జరిమానాను మ్యాచ్‌ రిఫరీ డేవిడ్‌ బూన్‌ విధించాడు. ఐసీసీ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా ఆర్టికల్‌ 2.22 ప్రకారం ఆటగాళ్లపై ప్రతి స్లో ఓవర్‌కు 20శాతం చొప్పున కోత విధించినట్లు బూన్‌ పేర్కొన్నాడు. ఈ కారణంగా ఇంగ్లండ్‌ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో 5పాయింట్లు కోల్పోయింది. మరోవైపు అసభ్య పదజాలం ఉపయోగించిన ఆస్ట్రేలియా బ్యాటర్‌ ట్రావిస్‌ హెడ్‌కు మ్యాచ్‌ ఫీజులో కోత విధించారు. తొలి టెస్టులో ట్రావిస్‌ హెడ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఐసీసీ నియమాలను ఉల్లంఘించి అసభ్య పదాలను ఉపయోగించడంతో ఆర్టికల్‌ 2.3ప్రకారం అతడికి 15శాతం మ్యాచ్‌ ఫీజులో కోత విధించడంతోపాటు ఓ డీమెరిట్‌ పాయింట్‌ను ఇచ్చారు.

రెండో స్థానంలో ఆస్ట్రేలియా.. ఆరోస్థానంలో ఇంగ్లండ్‌
యాషెస్‌ సిరీస్‌ తొలి టెస్టులో ఘనవిజయం సాధించిన ఆస్ట్రేలియా 5టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ క్రమంలో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ రెండో ఎడిషన్‌ పాయింట్ల పట్టికలో రెండోస్థానానికి చేరుకుంది. డబ్ల్యూటీసీ సెకండ్‌ ఎడిషన్‌లో తొలి సిరీస్‌ ఆడుతున్న ఆసీస్‌ ఈ విజయంతో 12పాయింట్లు సాధించడంతోపాటు 100శాతం పర్సంటేజ్‌ను సొంతం చేసుకుంది. కాగా భారత్‌తో 2-1తేడాతో సిరీస్‌ను కోల్పోయిన ఇంగ్లండ్‌ ఆసీస్‌తో జరిగిన టెస్టులోనూ ఓడిపోవడంతో 14పాయింట్లు 23.33పర్సంటేజీతో 6వ స్థానానికి పడిపోయింది. 24పాయింట్లు, 100 పర్సంటేజీతో శ్రీలంక అగ్రస్థానంలో కొనసాగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement