భారత్ లో కరోనా సంక్షోభం నెలకొన్నప్పటికీ ఐపీఎల్ టోర్నీ మాత్రం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. అయితే కొందరైతే ఇంత విపత్కర పరిస్థితుల్లో ఐపీఎల్ నిర్వహించడం అవసరమా అన్న కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో ఇలాంటి పరిస్థితుల్లో జనాలకు కాస్తోకూస్తో వినోదం ఐపీఎల్ అందిస్తుందని ప్రజలు మానసికంగా ఉత్సాహాన్ని పొందుతారని మరికొందరు అంటున్నారు. అయితే అయితే torni సజావుగా సాగుతున్నప్పటికీ కొందరు ఆటగాళ్లు, అంపైర్లు కరోనా నేపథ్యంలో టోర్నీ నుంచి తప్పుకోవడం తెలిసిందే. అశ్విన్ తన కుటుంబ సభ్యులు కరోనా బారినపడడంతో టోర్నీ నుంచి వైదొలగగా… కేన్ రిచర్డ్సన్, ఆడమ్ జంపా, ఆండ్రూ టై వంటి ఆస్ట్రేలియా ఆటగాళ్లు టోర్నీ మధ్యలోనే స్వదేశం బయల్దేరారు. ఈ నేపథ్యంలో, ఆటగాళ్లే కాదు, ఓ అంపైర్ కూడా కరోనా ఎఫెక్ట్ తో ఐపీఎల్ కు దూరమయ్యాడు.
భారత్ లో జరిగే సిరీస్ లతో పాటు ఐపీఎల్ లోనూ విధులు నిర్వర్తించే నితిన్ మీనన్ తన కుటుంబ సభ్యుల కోసం టోర్నీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. నితిన్ మీనన్ తల్లి, భార్య ఇద్దరూ కరోనా బారినపడ్డారు. వారికి పాజిటివ్ రావడంతో, ఈ కష్ట సమయంలో తాను కుటుంబం చెంతన ఉండాలని అంపైర్ నితిన్ మీనన్ నిర్ణయించుకున్నాడు. అందుకే ఐపీఎల్ బయో బబుల్ నుంచి వైదొలగుతున్నట్టు వెల్లడించాడు. ప్రస్తుతం తాను ఆసుపత్రి వద్ద తన కుటుంబ సభ్యుల బాగోగులు చూసుకుంటున్నానని తెలిపాడు.