తుంగా తీరంలో ఆధ్యాత్మిక శోభ

  • భక్తులతో పులకించిన శ్రీ మఠం
  • డ్రోన్, హెలికాప్టర్‌లతో పూల వర్షం
  • అలరించిన నృత్యాలు, కోలాటాలు, భజనలు
  • లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు

మంత్రాలయం, ఆంధ్రప్రభ: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన మంత్రాలయంలో తుంగభద్ర తీరం భక్తజన సంద్రంగా మారింది. ఇష్టదైవమైన శ్రీ రాఘవేంద్ర స్వామి వైభవాన్ని తిలకించేందుకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. భక్తుల రాఘవేంద్ర నామస్మరణతో శ్రీమఠం పరిసరాలు మారుమోగాయి. శ్రీ రాఘవేంద్ర స్వామి 355వ సప్తరాత్రోత్సవాల్లో భాగంగా ఉత్తరారాధన సందర్భంగా సోమవారం మహారథోత్సవాన్ని అత్యంత రమణీయంగా నిర్వహించారు.

శ్రీమఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థులు వేకువజామున ఉత్సవాలకు అంకురార్పణ చేసి బృందావనానికి సంస్థాన పూజలు నిర్వహించారు.వజ్ర వైడూర్య రత్నాలతో పొదిగిన బంగారు ఆభరణాలతో అలంకరించిన ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలను సంస్కృత వేద పాఠశాల నుంచి ఊరేగింపుగా శ్రీమఠానికి తీసుకువచ్చారు. అనంతరం పీఠాధిపతి ప్రత్యేక పూజలు నిర్వహించి మహామంగళహారతి ఇచ్చారు.

నవ వసంతోత్సవంతో సందడి వసంతోత్సవంలో భాగంగా మఠం పిఠాధిపతి శ్రీ సుబుదేంద్ర తీర్థులు,అర్చకులు, సిబ్బంది, భక్తులపై రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా వేడుకలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తిని మహారథంపై అధిష్ఠించారు. భక్తులు ‘జయహో రాఘవేంద్ర గురు.. విజయహో రాఘవేంద్ర’ అంటూ పెద్ద ఎత్తున జయధ్వానాలు చేశారు. శ్రీమఠం ముఖద్వారం నుంచి మధ్వమార్గ్ కారిడార్ మీదుగా మహారథం ముందుకు సాగింది. చండీలు, నాదహారం, కోలాటాలు, వివిధ నృత్యాలు, బీరప్ప డోలు, భజనలు, మంగళ వాయిద్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

హెలిక్యాప్టర్ తో పూల వర్షంతో కనువిందు..

మహారథం ఊరేగింపు సాగుతున్న సమయంలో డ్రోన్, హెలికాప్టర్‌ల ద్వారా రథంపై పూల వర్షం కురిపించారు. ఈ దృశ్యాన్ని చూసిన భక్తులు పులకించిపోయారు. మహారథం రాఘవేంద్ర సర్కిల్ వరకు వెళ్లి తిరిగి శ్రీమఠానికి చేరుకుంది. రథంపై నుంచి పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు భక్తులను ఉద్దేశించి అభివాదం చేశారు. అనంతరం పీఠాధిపతి హెలికాప్టర్ పైకి రథోత్సవం పై పీఠాధిపతి చేతుల మీదుగా పూల వర్షం కురిపించారు.

ప్రముఖుల హాజరు..

మహారథోత్సవంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, టిడిపి నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎన్. రాఘవేంద్ర రెడ్డి, పన్నాగ వెంకటేశప్ప స్వామి, రాకేష్ రెడ్డి, రాజా రెడ్డి, వరదరాజులు, డీసీ తిమ్మప్ప, నాగేష్,అశోక్ రెడ్డి, చిన్న భీమా,వెంకటేష్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. మఠం సిబ్బంది ఏఏఓ మాధవ శెట్టి, మేనేజర్లు ఎస్.కే. శ్రీనివాసరావు, వెంకటేష్ జ్యోషి, శ్రీపతాచార్, పి.ఐ. నరసింహమూర్తి, వ్యాసరాజ్ ఆచార్, కోనాపూర్ సురేష్, పురానిక్, జె.పీ. స్వామి, బద్రీనాథ్, బిందుమాధవ్, రవి కులకర్ణి, ద్వారపాలక అనంతస్వామి, భీమసేనరావు, శ్రీనిధి తదితర మఠం సిబ్బంది పాల్గొన్నారు.

పటిష్ట పోలీస్ బందోబస్తు..

మహారథోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్‌ఐ మల్లికార్జున, సీఐ లు రామంజుల,దస్తగిరి బాబు, ఎస్‌ఐలు శివంజిల్, ఎస్‌ఐ విజయ్‌కుమార్‌తో పాటు ఎమ్మిగనూరు డివిజన్ పరిధిలోని పలువురు సీఐలు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది భారీ బందోబస్తులో ఏర్పాటు చేశారు.