పారిశుధ్య నిర్వహణ పనులను పరిశీల‌న‌…

పారిశుధ్య నిర్వహణ పనులను పరిశీల‌న‌…

20 ప్రత్యేక టీమ్స్ తో పర్యవేక్షణ
శానిటేషన్ సిబ్బంది ఉదయం 5:30 నుంచే విధుల్లో ఉండాలని ఆదేశం

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : నగరంలో పారిశుధ్య నిర్వహణ తీరును స్వయంగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక మేధర వీధి, మార్కెట్ ఏరియా, ఇప్పిలి వీధి, చిన్న బజార్, పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. డయేరియాను పూర్తిగా అరికట్టేందుకు 20 ప్రత్యేక టీమ్స్ తో పర్యవేక్షణ జరుగుతుందని అందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ సందర్భంలో డయేరియాను పూర్తిగా అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని చర్యలను తీసుకుంటుండగా కొంతమంది వ్యాపారులు చికెన్ షాపులను తెరవడంపై కలెక్టర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మార్కెట్లో పర్యవేక్షిస్తూ వివిధ వ్యాపారులు తమ వ్యాపారాలు చేయు స్థలాల్లో వేస్టేజ్ గా పడి ఉన్న వ్యర్థాలను ఎందుకు తొలగించలేదని వర్తకులను ప్రశ్నిస్తూ కొన్ని షాపులను మూయించి వేశారు.

ఇకపై ఈ విధంగా జరిగినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సచివాలయ సిబ్బందికి, ప్రజలకి మధ్య సమన్వయం ఉండాలనీ, వ్యర్ధాలను సేకరించుటకు వచ్చిన పారిశుద్ధ్య కార్మికులకు సహకరించాలని వర్తకులను, ప్రజలను కోరారు. పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లు ఉండకూడదని, యుద్ధ ప్రాతిపదికన పూడికతీత, వ్యర్థాల తొలగింపు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పారిశుధ్య కార్మికులకు కేటాయించిన ట్రాక్టర్‌, జేసీబీ యంత్రాల సహాయంతో నగరంలో ఎక్కడ కూడా చెత్త కనిపించకుండా చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఆవులు తిరిగే ప్రదేశంలో పేడ కనిపించడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరుకుగా ఉన్న రోడ్లలో చిరు వ్యాపారులు డ్రైనేజీ కాలువకు దగ్గరలో వ్యాపారాలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. డయేరియా వ్యాప్తి చెందడానికి ఒక్క త్రాగునీరే కారణం కాదని ఆహార వ్యవహారాలు, అపరిశుభ్రతే ప్రధాన కారణమని తెలిపారు. నగరంలో డయేరియా బాధితుల సంఖ్య నిలకడగా ఉందని, భయపడాల్సిన పని లేదని కలెక్టర్ తెలిపారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, మునిసిపల్ శాఖ అధికారులు, సిబ్బంది,సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply