ఆస్తి నేరాల దర్యాప్తుపై ప్రత్యేక దృష్టి సారించాలి

జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ: పెండింగ్‌లో ఉన్న ఆస్తి నేరాల కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, నిర్ణీత సమయంలో సమగ్ర దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయాలని జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు.మంగళవారం జిల్లా పోలీ సు కార్యాలయం నుంచి జామ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సై స్థాయి అధికారులతో జిల్లా ఎస్పీ ఆస్తి నేరాల కేసుల దర్యాప్తుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హౌస్‌ బ్రేకింగ్‌, చైన్‌ స్నాచింగ్‌, రాబరీ, డెకాయిటీ, మర్డర్‌ ఫర్‌ గెయిన్‌, ద్విచక్ర వాహనాల దొంగతనాలు తదితర ఆస్తి నేరాలకు సంబంధించిన పెండింగ్‌ కేసుల దర్యాప్తు పురోగతిని సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ,.. ఆస్తి నేరాల కేసుల ఛేదనలో సీసీ కెమెరాల ఫుటేజ్‌ కీలక ఆధారంగా నిలుస్తుందని, నేరం జరిగిన ప్రాంతంతో పాటు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజ్‌ను నిశితంగా పరిశీలించి, నిందితుల కదలికలను గుర్తించాలని సూచించారు. నేర స్థలంలో లభించే భౌతిక ఆధారాలతో పాటు సాంకేతిక ఆధారాలను శాస్.. య పద్ధతిలో సేకరించి, వాటిని విశ్లేషిస్తూ సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు.ఆస్తి నేరాలకు సంబంధించి ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేసి, ఆలస్యం చేయకుండా క్షేత్రస్థాయిలో విచారణ ప్రారంభించాలని స్పష్టం చేశారు. నేరస్థుల గత చరిత్ర, నేరం జరిగిన విధానం, సాంకేతిక ఆధారాలు తదితర అంశాలను సమన్వయం చేసుకుంటూ దర్యాప్తు చేపట్టాలని సూచించారు.పెండింగ్‌లో ఉన్న ప్రాపర్టీ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రతి కేసు దర్యాప్తు పురోగతిని సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. దర్యాప్తులో జాప్యం లేకుండా, నిర్ణీత సమయంలో కేసుల ఛార్జ్‌షీట్లను కోర్టులో దాఖలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, సంబంధిత పోలీసు అధికారులు పాల్గొన్నారు.