- 30 మందికి కౌన్సిలింగ్..
- రూ.1.50 లక్షల జరిమానా
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ: రోడ్డు ప్రమాదాల నివారణ కార్యక్రమంలో భాగంగా, నంద్యాల జిల్లాలో లైసెన్స్ లేకుండా మైనర్లు వాహనాలు నడుపుతున్నారని గుర్తించిన పోలీసులు, వారిపై చర్యలు ప్రారంభించారు. మైనర్లకు వాహనాలు నడిపితే.. తల్లిదండ్రులదే బాధ్యత అని పోలీసులు హెచ్చరించారు.
జిల్లా ఎస్పీ సునీల్ సునీల్ షోరాణ్ ఆదేశాల మేరకు, నంద్యాల ఏఎస్పీ ఎం. జావళి సూచనలతో, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ మల్లికార్జున గుప్తా ఆధ్వర్యంలో ఆదివారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా 30 మంది మైనర్లు చట్టవిరుద్ధంగా టూ-వీలర్లు నడుపుతున్నట్లు గుర్తించారు. ఒక్కొక్కరికి రూ.5,000 చొప్పున జరిమానా విధించి, మొత్తం రూ.1.50 లక్షలు వసూలు చేశారు. అదనంగా, వారిని తల్లిదండ్రులు/సంరక్షకులతో కలిసి స్టేషన్‌కు పిలిపించి, రోడ్డు భద్రత, చట్టపరమైన పరిణామాలు గురించి కౌంన్సిలింగ్ చేశారు.
బాధ్యతగల పర్యవేక్షణ అవసరమని తల్లిదండ్రులకు తెలియజేశారు. అలాగే, మైనర్లకు ట్రాఫిక్ నియమాలు, సురక్షిత డ్రైవింగ్ పద్ధతులు గురించి ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ మల్లికార్జున గుప్తా కౌన్సిలింగ్ ఇచ్చారు.

