స్థానిక సంస్థల ఎన్నికల ఓటర్ జాబితా రూపకల్పనలో ప్రభుత్వం అక్రమాలకు పాల్పడే అవకాశముందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం, ఈ ఏడాది సెప్టెంబర్ 30లోపు స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ గురువారం పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి కీలక సూచనలు చేశారు.
పార్టీ అనుకూల ఓటర్లు జాబితా నుంచి తొలగిపోకుండా పర్యవేక్షించాలని ఆయన స్పష్టంగా ఆదేశించారు. ఎన్నికల సంఘం విడుదల చేసే ఓటర్ జాబితా డ్రాఫ్ట్ ను గ్రామస్థాయిలోనే జాగ్రత్తగా పరిశీలించాలని, ఏవైనా లోపాలు కనిపిస్తే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు.
అదే విధంగా, జాబితా పర్యవేక్షణ కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్సీలు ఎల్. రమణ, డా. దాసోజు శ్రవణ్, అలాగే పార్టీ జనరల్ సెక్రటరీ భరత్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కమిటీ పనిచేస్తుందని కేటీఆర్ వెల్లడించారు. ఓటర్ జాబితాలో ఏవైనా అవకతవకలు బయటపడితే వెంటనే ఈ కమిటీ దృష్టికి తీసుకురావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.