బాలాపూర్ మహా గణనాథుడిని దర్శించుకున్న స్పీకర్ గడ్డం ప్రసాద్
- ఆకట్టుకున్న పూరీ జగన్నాథుడి ఆలయ మండపం..
- తెలంగాణ సమాజం సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక పూజలు
ఆంధ్రప్రభ: బాలాపూర్ మహా గణనాథుడిని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి వారు గణనాథుడికి పూజలు నిర్వహించారు. తెలంగాణ సమాజం, రైతులు సుభిక్షంగా ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి అన్నదాతల జీవితాల్లో ఆనందం వెల్లివిరియాలని వారు ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధి సాధించాలని గణపయ్యను వేడుకున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా పేదలకు అందాలని స్పీకర్ గడ్డం ప్రసాద్, కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఆకాంక్షించారు. బాలాపూర్‌లో ఏర్పాటు చేసిన పూరీ జగన్నాథుడి ఆలయ ఆకృతిలోని గణేష్ మండపం ప్రత్యేకంగా ఆకట్టుకుంది. అంతకుముందు జిల్లెలగూడ, మీర్‌పేట, ప్రశాంతిహిల్స్, అల్మాస్‌గూడ డివిజన్లలోని వివిధ వినాయక మండపాలను వారు సందర్శించారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
