Speaker Decision | ఆ ఎమ్మెల్యేలపై వేటు పడుతుందా? లేదా?

Speaker Decision | ఆ ఎమ్మెల్యేలపై వేటు పడుతుందా? లేదా?
- తేలేది ఈ రోజు మధ్యాహ్నం మూడున్నర గంటలకు
- ఫిరాయింపుల ఆరోపణలపై తీర్పు ఇవ్వనున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
- తొలిదశలో ఐదుగురు ఎమ్మెల్యేలపై తీర్పు
ఇంకా ఇద్దరు ఎమ్మెల్యేలపై పూర్తి కాని విచారణ
Speaker Decision | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : బీఆర్ఎస్ పోరాటం ఫలిస్తుందా? లేదా? అనేది ఈ రోజు మూడున్నర గంటల తర్వాత తెలుస్తుంది. పార్టీ ఫిరాయింపు ఆరోపణల ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలపై వేటు పడుతుందా? లేదా? అనేది కూడా ఆసక్తిగా మారుతుంది. ఈ రోజు మధ్యాహ్నం మూడున్నర గంటలకు స్పీకర్ (Speaker) గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పు ఇవ్వనున్నారు. ఒకవేళ వేటు పడితే ఆ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవు. వేటు పడకపోతే బీఆర్ఎస్ ఎలాంటి పోరాటం చేస్తుంది అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఒక వేళ స్పీకర్ వేటు వేస్తే ఇది ఒక రికార్డు అవుతుంది.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన శాసనసభ్యులు (ఎమ్మెల్యేల) (MLA) అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో వారిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్, బీజేపీ నేతలు కోర్టును ఆశ్రయించారు. స్పీకర్ వెంటనే చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. దీంతో బీఆర్ఎస్ నేతల పిటిషన్ల పలు దఫాలుగా విచారించిన స్పీకర్ ఈ రోజు తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు స్పీకర్ కార్యాలయంలో ఈ కీలక తీర్పు వెలువడనుంది. బీఆర్‌ఎస్ పార్టీ తరఫు అడ్వకేట్‌లు, అలాగే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అడ్వకేట్‌లు తీర్పు ప్రకటన కోసం స్పీకర్ కార్యాలయానికి హాజరుకానున్నారు. తీర్పు కాపీలను వెబ్‌సైట్‌లో కూడా స్పీకర్ కార్యాలయం పెట్టనుంది.
రేపటితో ముగియనున్న సుప్రీంకోర్టు గడువు
బీఆర్‌ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ (Prasadkumar) ఈ రోజుతీర్పు వెలువరించనున్నారు. తొలిదశలో ఐదుగురు ఎమ్మెల్యేల పిటిషన్లపై తీర్పు ఇవ్వనున్నట్టు స్పీకర్ కార్యాలయం తెలిపింది. ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, గూడెం మహిపాల్‌రెడ్డి, అరికెపూడి గాంధీకి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై నిర్ణయం ప్రకటిస్తారని వెల్లడించింది. ఈ పిటిషన్లపై నాలుగు వారాల్లోగా తేల్చాలని సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు గురువారంతో ముగుస్తున్నది. ఇంతలోనే స్పీకర్ తన తీర్పు వెల్లడించనున్నారు.
ఆ ఐదుగురు…
ఈ రోజు తీర్పు ఇవ్వనున్న ఐదుగురు పై వేటు పడే అవకాశాలు కనిపించడం లేదని పలువురు భావిస్తున్నారు. ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, గూడెం మహిపాల్‌రెడ్డి, అరికెపూడి గాంధీ కాంగ్రెస్‌లో (Congress) చేరినప్పటికీ ఎలాంటి ఆధారాలు లేకుండా జాగ్రత్త పడ్డారన్నది చర్చించుకుంటున్నారు. ఆ ఐదుగురికి అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉందని ఆయా ఎమ్మెల్యే వర్గీయులు కూడా భావిస్తున్నారు. ఏమి జరుగుతుందో చూద్దాం.
