AFG vs SA | సఫారీలు సూపర్… !
- ఆరంభం అదుర్స్
- ఆఫ్ఘాన్ పై ఘన విజయం
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఈరోజు జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు తమ తొలి మ్యాచ్‌లో అదిరే బోణీ కొట్టింది. కరాచీ వేదికగా ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో 107 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా.. ఆఫ్ఘనిస్థాన్ ముందు 316 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలుత బ్యాటింగ్ లో దుమ్ము రేపిన సఫారీలు… ఆ తర్వాత బౌలింగ్ లోనూ బెంబేలెత్తించారు. ఫలితంగా భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్థాన్ 208 పరుగులకే కుప్పకూలింది.
అయితే, అఫ్గాన్ బ్యాటర్లలో రహ్మత్ షా (90) ఒంటరి పోరాటం చేసినా… ఫలితం లేకుండా పోయింది. రహమత్ షా మినహా మరే ఆటగాడు కనీసం 20 పరుగులు కూడా చేయకుండా పెవిలియన్ చేరాడు.
ఇక దక్షిణాఫ్రికా బౌలర్లలో కగిసో రబడ మూడు వికెట్లు తీయగా.. లుంగీ నిగిడి, వియాన్ ముల్డర్ రెండేసి వికెట్లు పడగొట్టారు. ఇక మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్ తలో వికెట్ దక్కించుకున్నారు.
అంతకముందు తొలి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా విధ్వంసక బ్యాటింగ్‌తో చెలరేగింది. ఆ జట్టు ఓపెనర్ యువ ఆటగాడు రియాన్ రికెల్టన్ (103) తొలి వన్డే సెంచరీని సాధించాడు. ఆఫ్ఘాన్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కంటూ శతకొట్టాడు. ఇక కెప్టెన్ టెంబ బావుమా(58), రాస్సీ వాన్ డెర్ డుసెన్ (52) లు హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఆఖరి ఓవర్లలో ఐడెన్ మార్క్రామ్ (36 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్ 52 నాటౌట్), వియాన్ ముల్డర్ (6 బంతుల్లో 12 ఒక పోరు, సిక్స్) బౌండరీలతో బెంబేలెత్తించారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 315 పరుగులు సాధించింది.
కాగా, ఈ టోర్నీలో భాగంగా రేపు (శనివారం – ఫిబ్రవరి 22న) ఆస్ట్రేలియా – ఇంగ్లండ్ జట్లు (గ్రూప్ బీ) తలపడనున్నాయి.