( ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో ) : విజయవాడ రైల్వే డివిజన్ (Vijayawada Railway Division) పరిధిలోని సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని, అమృత భారత స్టేషన్ 2.0 పథకం కింద విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్దికి నీతి ఆయోగ్ మంజూరు చేసిన నిధులను రైల్వే శాఖ ద్వారా త్వరితగతిన విడుదల చేయించాలని రైల్వే బోర్డ్ చైర్మన్ సతీష్ కుమార్ (Railway Board Chairman Satish Kumar) కు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (MP Keshineni Sivanath) విజ్ఞప్తి చేశారు. న్యూఢిల్లీలో రైల్వే బోర్డ్ చైర్మన్ సతీష్ కుమార్ ను రైల్ భవన్ లోని ఆయన కార్యాలయంలో ఎంపీ కేశినేని శివనాథ్ ఇవాళ కలిసి విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో నెలకొన్న సమస్యలను రైల్వే బోర్డ్ చైర్మన్ సతీష్ కుమార్ తో ఎంపీ కేశినేని శివనాథ్ ప్రస్తావించారు.
విజయవాడ రైల్వే డివిజన్‌లో పెండింగ్ లో వున్న లెవెల్ క్రాసింగ్ నెం.316 (విజయవాడ – గుణదల), లెవెల్ క్రాసింగ్ నెం. 147 (రాయనపాడు – కొండపల్లి), లెవెల్ క్రాసింగ్ నెం.148 (విజయవాడ – రాయనపాడు), లెవెల్ క్రాసింగ్ నెం.8 (విజయవాడ -రామవరప్పాడు), వద్ద రోడ్ ఓవర్ బ్రిడ్జ్‌లు (ఆర్ ఓ బీ), రోడ్ అండర్ బ్రిడ్జ్‌లు (ఆర్ యూ బి ఎస్) నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని విన్నవించారు.
అలాగే అమృత భారత స్టేషన్ 2.0 పథకం కింద విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్దికి నీతి ఆయోగ్ మంజూరు చేసిన రూ.836.47 కోట్ల నిధులను రైల్వే శాఖ తొందరగా విడుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఎంపీ కేశినేని శివనాథ్ కోరారు. ఎంపీ కేశినేని శివనాథ్ చేసిన విజ్ఞప్తులపై రైల్వే బోర్డ్ చైర్మన్ సతీష్ కుమార్ సానుకూలంగా స్పందించటమే కాకుండా వెంటనే సంబంధిత అధికారులకు స్వయంగా ఫోన్ చేసి తగిన ఆదేశాలు జారీ చేశారు.