ఇంటి పైకప్పుపై సోలార్.. విద్యుత్ బిల్లుకు చెక్
వైరా, ఆంధ్రప్రభ : ప్రధానమంత్రి సూర్య ఘర్ ఉచిత్ బిజిలీ పథకానికి సంబంధించిన బ్రోచర్‌ను వైరా మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ మురళీకృష్ణ గురువారం మున్సిపల్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పథకం ద్వారా అందించే సబ్సిడీ, సోలార్ విద్యుత్ వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలను ఆమె వివరించారు.
ప్రధానమంత్రి సూర్య ఘర్ ఉచిత్ బిజిలీ పథకం కింద ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకుని విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవచ్చని చంద్రకళ తెలిపారు. అర్హతను బట్టి రూ.78 వేల వరకు సబ్సిడీ పొందవచ్చన్నారు. నెలకు 300 యూనిట్ల వరకు విద్యుత్ ప్రయోజనం పొందే అవకాశం ఉందని పేర్కొన్నారు.
అవసరానికి మించి విద్యుత్ ఉత్పత్తి అయితే నిబంధనల ప్రకారం గ్రిడ్‌కు విక్రయించవచ్చని తెలిపారు. గ్రూప్ హౌసింగ్ సొసైటీలకు కూడా ఈ పథకం కింద సబ్సిడీ వర్తిస్తుందని చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ వంటి అవసరాలకు కూడా సౌర విద్యుత్‌ను వినియోగించుకోవచ్చన్నారు.
ఒకసారి సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకుంటే సుమారు 25 ఏళ్ల వరకు విద్యుత్ ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంటుందని చంద్రకళ తెలిపారు. గృహ యజమానులు తమ ఇంటి పైకప్పుపైనే సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకుని అవసరమైన విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవచ్చన్నారు. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా సంవత్సరానికి రూ.75 వేల కోట్ల వరకు ఆదా అవుతుందని ప్రభుత్వ అంచనా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ చింతనిప్పు సులోచన, విద్యుత్ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
