ఏజెన్సీలో ఇంత వివక్ష తగునా!
- సంక్షేమ పథకాలకు కొర్రీ ఎలా?
- సీఎం యాది లో.. ఆ హామీ లేనట్టే..
బయ్యారం, ఆంధ్రప్రభ : సురాపానం పేర దేవతలకే దాహార్తి ని తీర్చిన కులం. మొట్టమొదటి బహుజన రాజ్యాన్ని స్థాపించి గోల్కొండ ఖిల్లా(Golconda Fort) పై జెండాను ఎగురవేసిన ధీరున్ని కన్న కులం. మలిదశ తెలంగాణ ఉద్యమంలో మోకు దెబ్బ రుచి చూపించిన కులం.. అలాంటి చరిత్ర కలిగిన గౌడు కులస్తులు నేడు ప్రభుత్వాల చిన్నచూపు వల్ల జీవన పోరాటంలో అలసిపోతున్నారు. కుల వృత్తులలో అత్యంత ప్రమాదకరమైన వృత్తిని చేసుకుంటూ బ్రతుకు పోరును సాగిస్తున్న గౌడులు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు.
ఆకాశానికి భూమికి మధ్య ప్రాణాలను పణంగా పెట్టి కల్లు గీసి బతుకుతున్న గీత కార్మికుల కష్టాలు అన్ని ఇన్ని కావు. ముఖ్యంగా ఏజెన్సి గౌడుల పరిస్థితి మరింత దయనీయం.ఒకే వృత్తి, ఒకే జీవన విధానం కాని ఏజెన్సీ, మైదాన ప్రాంతం(Agency, Maidan Area) పేర వివక్షత. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏజెన్సి గౌడులకు అందడంలేదు. ఏజెన్సి ప్రాంతం లోని కల్లు గీత సహకార సంఘాలను రెన్యువల్ చేయకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2002 లో నిలిపి వేసింది.
ఇలాంటి సమస్యలే మలిదశ తెలంగాణ ఉద్యమంలో గౌడులను మరింత ఉసిగొల్పాయి. తెలంగాణ సిద్ధిస్తే అన్ని సమస్యలు సమసి పోతాయని గౌడులు తెగించి పోరాడారు. కాని స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత కూడా వారి భాదలు తీరలేదు. మహబూబాబాద్(Mahbubabad), భద్రాద్రి కొత్తగూడెం, జయ శంకర్ భూపాల పల్లి, ములుగు, కొమరం భీమ్ తదితర జిల్లాలోని షెడ్యూల్ ఏరియాలో గీత కార్మిక సహకార సంఘాలను రెన్యువల్ చేయక పోవడం వల్ల సుమారు 4 లక్షల కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందడం లేదు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌడు కులస్తులకు 55ఎండ్లకే వృధ్యాప పెన్షన్(Old Age Pension), తాటి, ఈత, చెట్ల పెంప కానికి భూమి కేటాయింపు, చెట్ల పన్ను రద్దు తాటి చెట్టు పై నుండి పడి మరణిస్తే 5లక్షల ఎక్స్ గ్రేషియా లాంటి పథకాల అమలు చేస్తుంది. అయితే ఈ పతకాలేవి ఏజెన్సీ ప్రాంతంలోని వారికి అందడం లేదు.
చస్తే పైసా విదల్చని సర్కారు
ఏజెన్సీప్రాంతంలో గౌడులు వృత్తిరీత్యా చెట్టు మీద నుండి పడి మరణిస్తే కనీస కనికరం కూడా ప్రభుత్వాలు చూపడం లేదు.రోడ్డు ప్రమాదాల వల్ల ప్రకృతి వైపరీత్యాల వల్ల మరణించిన వారి కుటుంబాలను పలకరించి లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తున్న ప్రభుత్వం ఏజెన్సీ(Government Agency) గౌడులకు ఒక్క పైసా ఆర్థిక సహాయం అందించడం లేదు. ఫలితంగా అనేక కుటుంబాలు ఈనాడు వీధిపాలైనాయి.
కులవృత్తులకు అమలులో వివక్షత
బీసీ కులాల్లో యాదవ, ముదిరాజ్, బెస్త, వడ్డెర, తదితర కులాలకు సహకార సంఘాలను కొనసాగిస్తూ వాటి ద్వారా సబ్సిడీ(Subsidy)పై గొర్రెలు, మేకలు, చేపల పెంపకానికి చెరువులు, అందిస్తున్న ప్రభుత్వం కేవలం గౌడు కులస్తులపై మాత్రమే ఎందుకు వివక్షత చూపుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని గౌడు కులస్తులకు, కల్లు గీసే హక్కు లేదు మరి తాము ఎలా బ్రతకాలి అని వారు వాపోతున్నారు.
జావగారిన జీవోలు
రాజ్యాంగంలోని ఆర్టికల్ 342 ప్రకారం, రాష్ర్ట విభజన అనంతరం జోవో నెం 5, 2014,జి వో నేం 2 2015 ప్రకారం ప్రభుత్వం ఏజెన్సీలోని గౌడులకు ఎస్టీ సర్టిఫికెట్స్ ఇవ్వాలని తెలిపారు. కానీ అది అమలు జరగడం లేదు. మరోవైపు గీత వృత్తి రక్షణ కూడా లేదు. ఈ నేపథ్యంలో వారు తెలంగాణ రాష్ట్ర ఏజెన్సీ గౌడు కుల పరిరక్షణ కమిటీపేర గత కొంత కాలం గా ఆందోళనలు, విన్నపాలు, విజ్ఞాపనలు చేస్తూ వస్తున్నారు.
సీఎం యాదిలో.. ఆ హామీ జాడ లే..
ఏజెన్సీ గౌడులు తమ ఆందోలన కార్యక్రమంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నసమయంలో తనను కలిసిన ఏజెన్సీ గౌడుల విన్నపం మేరకు అసెంబ్లీలో ఏజెన్సీ గౌడులకు ఎస్టీ కులదృవీకరణ పత్రాలు ఇవ్వాలని,వృత్తికి రక్షణ కల్పించాలని నాటి బి ఆర్ ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయం అప్పట్లో చర్చ నీయాంశ మైంది. ఏజెన్సీ గౌడులు రేవంత్ రెడ్డి చిత్ర పటానికి ఊరూరా పాలాభిషేకం చేసారు.
కానీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ తీరు బీఆర్ ఎస్ కు భిన్నంగా లేదని ఏజెన్సీ గౌడులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోరాటాలే శరణ్యం అనే భావనకు వచ్చిన ఏజెన్సీ గౌడులు గుండ్ల నర్సయ్య, నరాటి వెంకన్న,కొత్త వెంకటేశ్వర్లు, బసవ వెంకటేశ్వర్లు, ఉమ్మగాని సత్యం, మండరాజన్న, తిరుపతి మరికొందరి నాయకత్వాన తెలంగాణ రాష్ట్ర ఏజెన్సీగౌడు కుల పరిరక్షణ కమిటి ఏర్పాటుచేసి పోరాటాలకు సిద్ధమవుతున్నారు.