ఆస్పత్రి, హాస్టల్ ఆవరణలో పాము సంచారం!

భారీ పాముతో విద్యార్థులు, రోగుల్లో భయాందోళన
రాత్రి, పగలు తేడా లేకుండా కనిపిస్తున్న పాము
సమాచారం ఇచ్చినా పట్టించుకోని అధికారులపై స్థానికుల ఆగ్రహం

వేల్పూర్, ఆంధ్రప్రభ: వేల్పూర్‌ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి, సాంఘిక సంక్షేమ హాస్టల్‌ పరిసరాల్లో భారీ పెంజరపాము సంచరిస్తుండటంతో స్థానికులు, విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. హాస్టల్‌లో వందలాది మంది విద్యార్థులు నివసిస్తుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లోనే కాకుండా పగటి పూట కూడా పాము కనిపిస్తుండటంతో విద్యార్థులు భయపడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులు, గర్భిణీలు సైతం పాము సంచారంతో ఆందోళన చెందుతున్నారని స్థానికులు చెబుతున్నారు.

ఈ విషయంపై అటవీ శాఖ అధికారులకు, ఆసుపత్రి యాజమాన్యానికి సమాచారం ఇచ్చినా ఇప్పటివరకు స్పందన లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి, హాస్టల్‌ పరిసరాల్లో పిచ్చి మొక్కలు, చెత్తాచెదారం పేరుకుపోవడంతో అవి పాములకు ఆవాసంగా మారుతున్నాయని వాపోతున్నారు. ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే బాధ్యత ఎవరిదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి పామును పట్టుకోవడంతో పాటు ఆసుపత్రి, హాస్టల్‌ పరిసరాల్లో పారిశుధ్య పనులు చేపట్టాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.