Smriti Mandhana New Captain |భారత మహిళల జట్టు కొత్త కెప్టెన్‌గా నియామకం!
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్: భారత మహిళా క్రికెట్‌లో కీలక మార్పు చోటుచేసుకుంది. స్టార్ బ్యాటర్ స్మృతి మంధానకు భారత మహిళల వైట్‌బాల్ జట్టు పగ్గాలు అప్పగించారు. ఇప్పటివరకు కెప్టెన్‌గా వ్యవహరించిన హర్మన్‌ప్రీత్ కౌర్ తప్పుకోవడంతో.. ఆమె స్థానంలో మంధానను బీసీసీఐ కొత్త కెప్టెన్‌గా ప్రకటించింది. దీంతో వన్డే, టీ20 ఫార్మాట్లలో భారత జట్టును నడిపించే కీలక బాధ్యత మంధాన భుజాలపై పడింది.
కెప్టెన్సీలో ఇప్పటికే అనుభవం
మంధానకు నాయకత్వం కొత్తేమీ కాదు. భారత జట్టుకు గతంలోనే 18 టీ20లు, నాలుగు వన్డేల్లో కెప్టెన్‌గా వ్యవహరించారు. 2013లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి భారత జట్టులో కీలక బ్యాటర్‌గా కొనసాగుతున్న ఆమె.. ఇప్పుడు పూర్తి స్థాయి కెప్టెన్‌గా కొత్త బాధ్యతలు చేపట్టనున్నారు. బ్యాటింగ్‌లో తనదైన ముద్ర వేసిన మంధాన.. ఇక మైదానంలో వ్యూహాలు రచిస్తూ జట్టును విజయాల వైపు నడిపించాల్సి ఉంటుంది.
ఆర్‌సీబీతో కెప్టెన్సీకి మరింత గుర్తింపు
ఫ్రాంచైజీ క్రికెట్‌లోనూ మంధాన తన నాయకత్వ సామర్థ్యాన్ని ఇప్పటికే నిరూపించుకున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 2024, 2026 డబ్ల్యూపీఎల్ టైటిళ్లకు నడిపించారు. ఒత్తిడిలో నిర్ణయాలు తీసుకోవడం, జట్టును సమన్వయం చేయడం వంటి అంశాల్లో ఆమెకు ఈ అనుభవం ఇప్పుడు భారత జట్టుకు ఉపయోగపడనుంది.
‘‘ఇది ఎంతో ప్రత్యేకమైన గౌరవం’’
భారత జట్టుకు నాయకత్వం వహించే అవకాశం రావడం తనకు ఎంతో ప్రత్యేకమని మంధాన పేర్కొన్నారు. దేశానికి ప్రాతినిధ్యం వహించడం ఎప్పుడూ తనకు అత్యంత ముఖ్యమైన విషయమని.. ఇప్పుడు అదే జట్టుకు నాయకత్వం వహించే బాధ్యత దక్కడం మరింత గర్వంగా ఉందని చెప్పారు.తనపై నమ్మకం ఉంచిన బీసీసీఐ, సెలెక్టర్లు, సహచర క్రీడాకారిణులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అలాగే గత కొన్నేళ్లుగా జట్టును ముందుండి నడిపించిన హర్మన్‌ప్రీత్ కౌర్ సేవలను కూడా మంధాన ప్రత్యేకంగా గుర్తుచేశారు.
బీసీసీఐకి పూర్తి నమ్మకం…
మంధానకు భారత జట్టుపై ఉన్న అవగాహన, అంతర్జాతీయ అనుభవం ఆమెను ఈ బాధ్యతకు సరైన ఎంపికగా నిలబెట్టాయని బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్ పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా భారత క్రికెట్‌లో కీలక సభ్యురాలిగా ఉన్న మంధాన.. జట్టును ముందుండి నడిపించే లక్షణాలను ఇప్పటికే చూపించారని అన్నారు.ఆమె ఆటపై ఉన్న అవగాహన, అనుభవం కొత్త బాధ్యతల్లో ఎంతో ఉపయోగపడతాయని మన్హాస్ విశ్వాసం వ్యక్తం చేశారు.
‘‘మంధాన నాయకత్వం బలమైన ఆస్తి’’
బీసీసీఐ గౌరవ కార్యదర్శి దేవజిత్ సైకియా కూడా మంధాన నాయకత్వంపై నమ్మకం వ్యక్తం చేశారు. భారత మహిళా క్రికెట్‌లో ఆమె ఎన్నో కీలక ఘట్టాల్లో భాగమయ్యారని.. దేశానికి ప్రాతినిధ్యం వహించడం అంటే ఏమిటో ఆమెకు బాగా తెలుసని పేర్కొన్నారు. డబ్ల్యూపీఎల్‌లో ఆర్‌సీబీని విజయవంతంగా నడిపించడం ఆమె నాయకత్వ సామర్థ్యానికి నిదర్శనమని సైకియా అన్నారు. కెప్టెన్సీతో వచ్చే ఒత్తిడిని ఎదుర్కొనే అనుభవం, మానసిక దృఢత్వం మంధానకు ఉన్నాయని పేర్కొన్నారు.
ఇప్పటివరకు భారత జట్టుకు నమ్మకమైన బ్యాటర్‌గా కొనసాగిన మంధాన.. ఇక కెప్టెన్‌గా మరింత కీలక పాత్ర పోషించనున్నారు. ఒకవైపు బ్యాటింగ్‌లో జట్టుకు పరుగులు అందిస్తూ.. మరోవైపు మైదానంలో వ్యూహాలు రచించాల్సి ఉంటుంది.హర్మన్‌ప్రీత్ తర్వాత భారత మహిళా క్రికెట్‌లో మంధాన శకం మొదలైనట్లే. ఆమె నాయకత్వంలో భారత వైట్‌బాల్ జట్టు ఎలాంటి విజయాలు సాధిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
