Smriti Mandhana Emotional Post | హర్మన్‌ప్రీత్‌కు స్మృతి మంధాన భావోద్వేగ సందేశం

ముంబయి, ఆంధ్రప్రభ: భారత మహిళల క్రికెట్‌లో నాయకత్వ మార్పు చోటుచేసుకున్న వేళ.. మాజీ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌కు ప్రస్తుత కెప్టెన్‌ స్మృతి మంధాన హృదయపూర్వక సందేశం పంపారు. హర్మన్‌ప్రీత్‌తో కలిసి దాదాపు దశాబ్దకాలం ఆడటం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్న మంధాన.. ఆమె పదేళ్ల నాయకత్వాన్ని ప్రశంసించారు. భవిష్యత్తులోనూ కలిసి భారత జట్టుకు మరిన్ని విజయాలు అందించేందుకు కృషి చేద్దామని అన్నారు.

హర్మన్‌ప్రీత్‌ కెప్టెన్సీలో సాగిన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ మంధాన సోషల్‌ మీడియాలో భావోద్వేగ పోస్ట్‌ చేశారు. ఇన్నేళ్లు ఆమెతో కలిసి ఆడటం ఎంతో సంతోషంగా ఉందని.. పదేళ్ల పాటు జట్టును ముందుండి నడిపించిన తీరు అద్భుతమని కొనియాడారు. ఇక ముందు కూడా భారత క్రికెట్‌ కోసం కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు.

సహచరుల నుంచి ప్రశంసలు

హర్మన్‌ప్రీత్‌ కెప్టెన్సీకి వీడ్కోలు పలికిన నేపథ్యంలో పలువురు భారత క్రికెటర్లు ఆమెకు అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. హ్యామ్‌స్ట్రింగ్‌ గాయం కారణంగా ప్రస్తుతం జట్టుకు దూరంగా ఉన్న జెమీమా రోడ్రిగ్స్‌.. హర్మన్‌ప్రీత్‌ నాయకత్వానికి, జట్టు కోసం ఆమె చేసిన సేవలకు ధన్యవాదాలు తెలిపారు. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిచా ఘోష్‌ కూడా హర్మన్‌ప్రీత్‌తో కలిసి ఉన్న ఫొటోను పంచుకుంటూ.. కెప్టెన్సీ ముగిసినా నాయకురాలిగా ఆమె చూపిన ప్రభావం ఎప్పటికీ కొనసాగుతుందని పేర్కొన్నారు. భారత స్పిన్నర్‌ శ్రీ చరణి కూడా మాజీ కెప్టెన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.