అర్హులైన ప్రతి కుటుంబానికి స్మార్ట్ రేషన్ కార్డులు

గత పదేళ్లలో బీఆర్‌ఎస్‌ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు..
కాంగ్రెస్ నాయకులు పైడాకుల అశోక్, భానోత్ రవిచందర్
గోవిందరావుపేట,ఆంధ్రప్రభ:
అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్ అన్నారు.

రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆదేశాల మేరకు గురువారం గోవిందరావుపేట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను వారు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా జారీ చేయలేదని విమర్శించారు.

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడంతో పాటు, రేషన్ కార్డుదారులందరికీ సన్నబియ్యం పంపిణీ చేస్తోందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో రేషన్ కార్డులు లేని అర్హులైన ప్రతి కుటుంబానికి కార్డులు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ జోగా నాయక్, పీఏసీఎస్ చైర్మన్ పన్నాల ఎల్లారెడ్డి, తహసీల్దార్ కుసుమ రవీందర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పాలడుగుల వెంకటకృష్ణ, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు మద్దాలి నాగమణి, వివిధ గ్రామాల సర్పంచులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.