SLBC Tunnel Collapse | ఆటంకాలున్నా శరవేగంగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

అడుగడుగునా ఎన్నో అవంత‌రాలు
అయినా ఆగ‌కుండా సాగుతున్న ఆప‌రేష‌న్‌
జియాలజీ నిపుణుల సూచనలతో డీ వాటరింగ్ ప్రక్రియ
లోకో ట్రైన్‌లో ఐదు ట‌బ్బుల‌ బుర‌ద బ‌య‌ట‌కు
నిమిషానికి ఐదు లీట‌ర్ల మేర నీటి ఊట‌
యంత్రాల‌తో తోడేస్తున్న సిబ్బంది
టీబీఎం క‌టింగ్‌ కోసం సౌత్ సెంట్ర‌ల్‌ రైల్వే బృందం
సొరంగంలో 57 మంది నిపుణుల‌ స‌హాయ‌క చ‌ర్య‌లు
నిరంత‌రంగా సాగుతున్న స‌హాయ‌క ప్ర‌క్రియ‌
లోప‌ల‌కు ఆహారం, నీరు పంపుతున్న అధికారులు

అమ్రాబాద్ / అచ్చంపేట, ఆంధ్ర‌ప్ర‌భ : శ్రీ‌శైలం ఎడ‌మ బ్రాంచ్ కాలువ (ఎస్ఎల్‌బీసీ) ట‌న్నెల్‌లో రెస్క్యూ టీమ్ స‌భ్యులు స‌హాయ‌క చ‌ర్య‌లు ముమ్మ‌రం చేశారు. దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ట‌న్నెల్ ప్ర‌మాదంలో చిక్కుకున్న ఎనిమిది మంది ఆచూకీ కోసం ప‌ది ఏజెన్సీల రెస్క్యూ బృందాలు ఆరు రోజులుగా స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టిన విష‌యం తెలిసింది. ఆరోరోజుకు చేరిన వారి ఆచూకీ తెలియ‌క‌పోవ‌డంతో కుటుంబ స‌భ్యుల్లో మ‌రింత‌ ఉత్కంఠ ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ప్రమాదం జరిగి ఆరు రోజులు గడుస్తుండటంతో కార్మికులు ప్రాణాలతో ఉన్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. స‌హాయ‌క చ‌ర్య‌లకు ప్ర‌ధాన ఆటంకంగా ఉన్నా మూడు అవంత‌రాల‌ను అధిగ‌మించ‌డానికి బుధ‌వారం ప్ర‌ణాళిక చేశారు. ఈ ప్ర‌ణాళిక ప్ర‌కారం ముందుకు పోతున్నారు. మ‌రో 36 గంట‌ల్లో కార్మికుల ఆచూకీ గుర్తించ‌డం చేప‌ట్టిన ఆప‌రేష‌న్ కూడా స‌త్ఫ‌లితాలు ఇస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. ప్ర‌మాదం జ‌రిగే ప్ర‌దేశానికి రెస్క్యూ టీమ్ చేరిన‌ట్లు స‌మాచారం.

జియాల‌జీ నిపుణుల సూచ‌న‌తో…

టన్నెల్ లోని ప్రమాద ప్రదేశంలో 15 ఫీట్ల ఎత్తు 200 మీటర్ల మేర బురద పేరుకుపోయింద‌ని, ఇదే స‌హాయ‌క కార్య‌క్ర‌మాల‌కు అవంత‌రాల‌ని, అలాగే స‌హాయ‌క చ‌ర్య‌లు ముందుకు సాగ‌క‌పోవ‌డానికి ఇదే కార‌ణ‌మ‌ని రెస్క్యూ సిబ్బంది గుర్తించారు. టన్నెల్ లో ఉన్న నీటిని భారీ పంపులతో బయటికి పంపడం, బురదను తొలగించడం, ద్వారా డీబీఎం ముందుభాగం చెరుకోనున్నట్లు ప్ర‌ణాళిక చేశారు. ఈ ప్ర‌ణాళిక మేర‌కు జియాల‌జీ నిపుణుల‌ను ర‌ప్పించి వారి సూచ‌న‌ల‌తో బుర‌ద‌, నీటి ని తొల‌గిస్తున్నారు. ఉద‌యం జియాల‌జీ నిపుణులు, ఎన్‌డీఆర్ఎఫ్‌, ఎస్‌డీఆర్ఎఫ్‌, హైడ్రా, సింగ‌రేణి, జేపీ కంపెనీకి చెందిన 57 మంది బృందం లోకో రైలులో లోప‌ల‌కు వెళ్లారు. అయితే అందులో ఐదు పెద్ద‌పెద్ద బ‌కెట్ల‌తో బుర‌ద‌ను లోకో ట్రైన్‌లో బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చారు. ఈ ప్ర‌క్రియ కొన‌సాగుతోంది.

టీబీఎం క‌టింగ్ కోసం సౌత్ సెంట‌ర్ రైల్వే సాయం

టీబీఎం కటింగ్ కోసం సౌత్ సెంట‌ర్ రైల్వేలో ప‌నిచేస్తున్న నిపుణుల సాయం తీసుకున్నారు. సికింద్రాబాద్ నుంచి ఐదుగురు బృందం స‌భ్యులు ఇక్క‌డ‌కు చేరుకున్నారు. వారితో పాటు సామాగ్రిని కూడా లోకో ట్రైన్‌లో లోప‌ల‌కు పంపించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న ప‌ది ఏజెన్సీల‌తోపాటు స‌హాయ‌క చ‌ర్య‌ల్లో రైల్వే శాఖ నిపుణులు కూడా పాల్గొన్నారు.

లోకో ట్రైన్‌లో ఆహారం

రెస్క్యూ ఆప‌రేష‌న్‌లో పాల్గొన్న 57 మంది నిపుణుల‌కు ఆహారం, తాగునీరు, ఇత‌ర ఆహార ప‌దార్థాలు లోకో ట్రైన్‌లో లోప‌ల‌కు పంపించారు. ఇంకా వారికి అవ‌స‌ర‌మైన మెటీరియ‌ల్స్ లోప‌ల‌కు పంపిస్తున్నారు. లోప‌ల నుంచి వ‌చ్చిన బుర‌ద బ‌కెట్ల ఖాళీ చేసి అదే ట్రైన్‌లో పంపించారు. నిరంత‌రం ఆప‌రేష‌న్ చేయ‌డానికి అవ‌స‌ర‌మైన వాటిని లోప‌ల‌కు అందిస్తున్నారు. అలాగే నిరంత‌రం ఆక్సిజ‌న్ ఉండేలా ఏర్పాటు చేశారు. బ‌య‌ట ఉన్న జిల్లా కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌, ఎస్పీ వైభవ్‌ గైక్వాడ్‌, విపత్తుల నిర్వాహణ ఛీప్‌ సెక్రటరీ అరవింద్‌, ఇరిగేషన్‌ సెక్రటరీ శివరాజ్‌ పాటిల్‌ తదితరులు పర్యవేక్షిస్తున్నారు.

వారి ప్రాణాల‌పై ఆశ‌లు వ‌దులుకున్న‌ట్లేనా?

ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం జ‌రిగి ఆరు రోజులు అయింది. మంగళవారం, బుధవారం రెండు సార్లు రెస్క్యూ కోసం టన్నెల్ చివరి వరకు వెళ్లిన సిబ్బంది.. మాటల ప్రకారం.. టన్నెల్ లో ప్రమాదం జరిగిన చోట.. భారీగా బురద, మట్టి దిబ్బలు తప్ప ఏమీ కనిపించలేదని.. అన్నారు. అక్క‌డ భ‌యాన‌క ప‌రిస్థితులు ఉన్నాయ‌ని, అందుకే స‌హాయ‌క చ‌ర్య‌లు కూడా ముందుకు వెళ్ల‌లేక‌పోయామ‌ని చెబ‌తున్న మాట‌లు ప్ర‌కారం వారి ప్రాణాల‌పై ఆశ‌లు వ‌దులుకున్న‌ట్లే అని సంకేతాలు ఇచ్చిన‌ట్లు అయింది. టీబీఎంలో ఆ ఎనిమిది మంది ప్రాణాల‌తో ఉన్న‌ప్పుడు క‌టింగ్ చేస్తే వారి ప్రాణాల‌కు ముప్పు వ‌స్తుంద‌ని మొద‌ట రెస్క్యూ టీమ్ భావించారు. ఇప్పుడు కటింగ్‌కు సిద్ధ‌ప‌డ్డారంటే వారు ప్రాణాల‌తో లేర‌న్న నిర్థార‌ణ‌కు వ‌చ్చి ఉంటార‌ని అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అలాగే ఆక్సిజ‌న్ అంద‌క‌పోవ‌డంతో ప‌లుమార్లు రెస్క్యూ టీమ్ ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అలాగే క్లిష్ట‌ప‌రిస్థితుల‌లో వారు ప్రాణాల‌తో ఉండ‌గ‌ల‌రా? అనే అనుమానాలు వ్య‌క్తమ‌వుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *