ఎస్ఎల్‌బీసీ టన్నెల్, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలం దోమలపెంట గ్రామంలో గల ఎస్ఎల్‌బీసీ సొరంగంలో జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న వారి ఆచూకీ తెలుసుకునేందుకు చేపడుతున్న సహాయక చర్యలను వేగవంతం చేశారు. శనివారం ఉదయం మట్టి తవ్వకాలకు అనుగుణంగా వెంటిలేషన్ ప్రక్రియను ముందుకు కొనసాగించారు. సహాయక చర్యలకు ఆటంకంగా ఉన్న అన్ని పరిస్థితులను అధిగమిస్తూ, నిరంతరాయంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సహాయక బృందాలు పూర్తిస్థాయిలో నిర్విఘ్నంగా సహాయక చర్యలు చేపడుతున్నట్లు ప్రత్యేకాధికారి శివశంకర్ లోతేటి తెలిపారు. శనివారం సహాయక చర్యలపై సహాయక బృందాల ఉన్నతాధికారులతో కలిసి సహాయక చర్యలను పర్యవేక్షించిన ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి సమావేశం నిర్వహించారు.
వేగవంతంగా సహాయక పనులు
టన్నెల్ లోపల స్టీల్ తొలగింపు పనులు, మట్టి తవ్వకాలు, ఊట నీటిని బయటకు తరలించే ప్రక్రియ, కన్వేయర్ బెల్ట్ ద్వారా మట్టి నీ టన్నెల్ బయటకు చేరవేసే ప్రక్రియ, సమాంతరంగా జరుగుతున్నట్లు శివశంకర్ తెలిపారు. సహాయక బృందాలు పూర్తిస్థాయిలో సమన్వయంతో సహాయక చర్యలు వేగవంతం చేస్తున్నట్లు చెప్పారు. జీఎస్ఐ అధికారులు, నీటి పారుదల శాఖ అధికారులు నిరంతరం టన్నెల్ ప్రమాద ప్రదేశం వద్ద పరిస్థితులను గమనిస్తూ,సహాయక బృందాల ఉన్నతాధికారులకు తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో, ఆర్మీ అధికారులు వికాస్ సింగ్, విజయ్ కుమార్, జేపీ కంపెనీ సీనియర్ ప్రాజెక్టు ఇంజనీర్ సంజయ్ కుమార్ సింగ్, సింగరేణి వైన్స్ రిస్క్యూ జనరల్ మేనేజర్ బైద్య, ఎస్ డి ఆర్ ఎఫ్ అధికారి గిరిధర్ రెడ్డి, హైడ్రా అధికారి దక్షిణ మధ్య రైల్వే అధికారి రవీంద్రనాథ్, తదితరులు పాల్గొన్నారు.