గిరిజన అభివృద్ధికి సమన్వయంతో కృషి చేయాలి
గిరిజన అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది: ఎమ్మెల్యే కూన రవికుమార్
సీతంపేట, ఆంధ్రప్రభ : గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఆమదాలవలస నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ అన్నారు. సీతంపేట ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన 78వ పాలకవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమదాలవలస నియోజకవర్గంలోని ఐటీడీఏ పరిధిలో గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలపై పాలకవర్గ సభ్యులతో కలిసి సమీక్షించారు.
గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం, తాగునీరు, రహదారులు, సాగునీరు, వ్యవసాయం, మౌలిక వసతులు, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. గిరిజన గ్రామాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరచడంతో పాటు అర్హులైన ప్రతి గిరిజన కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని కూన రవికుమార్ సూచించారు.
అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజల అవసరాలను గుర్తించి వాటికి అనుగుణంగా ప్రాధాన్యత క్రమంలో పనులు చేపట్టాలని కోరారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలని సూచించారు. గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు.
ఈ సమావేశంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల కలెక్టర్లు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, పాలకొండ ఎమ్మెల్యే జయకృష్ణ, ఐటీడీఏ పాలకవర్గ సభ్యులు, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
