SIR Notices to Celebrities | లిస్ట్‌ లో మహేష్‌ బాబు, సమంత, విజయ్‌ దేవరకొండ, మరికొందరు ప్రముఖులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా హైదరాబాద్‌కు చెందిన పలువురు ప్రముఖులకు ఎన్నికల అధికారులు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఈ జాబితాలో సినీ తారలు, క్రీడాకారులు, ప్రముఖ పారిశ్రామికవేత్తల పేర్లు ఉండటంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. అయితే.. SIR నోటీసు అందుకున్నంత మాత్రాన ఓటు హక్కు రద్దయినట్లు కాదని ఎన్నికల అధికారులు స్పష్టం చేస్తున్నారు.

జాబీతాలో ప్రముఖులు..

హైదరాబాద్‌కు చెందిన సినీ ప్రముఖులు సమంత రూత్ ప్రభు, విజయ్ దేవరకొండ, మహేష్ బాబు, నమ్రత, ఎస్‌.ఎస్‌. రాజమౌళి, వెంకటేష్ దగ్గుబాటి తదితరుల పేర్లు SIR ధృవీకరణకు సంబంధించిన జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే మాజీ క్రికెటర్ వి.వి.ఎస్‌. లక్ష్మణ్, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్, బ్యాడ్మింటన్‌ కోచ్ పుల్లెల గోపీచంద్ పేర్లు కూడా ఉన్నట్లు సమాచారం.
ఇక నటుడు ఆనంద్ దేవరకొండ, రామ్‌చరణ్‌ భార్య ఉపాసన కొణిదెల, ఫార్మా రంగానికి చెందిన ప్రముఖుడు మురళీ కృష్ణ ప్రసాద్ దివి తదితరుల పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఓటర్ల జాబితాలోని వివరాలను పాత రికార్డులతో సరిపోల్చే ప్రక్రియలో భాగంగానే ఈ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ముఖ్యంగా పేరు, తల్లిదండ్రుల పేర్లలో వ్యత్యాసాలు ఉండటం, పాత SIR రికార్డులతో ఓటరు వివరాలను మ్యాప్‌ చేయలేకపోవడం వంటి కారణాలను అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. కొన్ని సందర్భాల్లో నోటీసుకు నిర్దిష్ట కారణాన్ని పేర్కొనలేదని కూడా సమాచారం.అంటే.. ఓటరు వివరాల్లో ఏదైనా సందేహం లేదా వ్యత్యాసం కనిపిస్తే సంబంధిత వ్యక్తి నుంచి వివరణ తీసుకుని రికార్డులను ధృవీకరించడమే ఈ ప్రక్రియ ప్రధాన ఉద్దేశం.

ఓటు హక్కు రద్దు అవుతుందా?

ఇదే అంశంపై ప్రస్తుతం ఎక్కువగా చర్చ జరుగుతోంది. అయితే అధికారులు చెబుతున్న దాని ప్రకారం SIR నోటీసు జారీ కావడం అంటే ఓటు హక్కు రద్దు కావడం కాదు. నోటీసు అందుకున్న వ్యక్తులు నిర్ణీత ప్రక్రియలో పాల్గొని తమ వివరాలను ధృవీకరించుకోవచ్చు. అవసరమైన పత్రాలను సమర్పించడం ద్వారా రికార్డుల్లో ఉన్న వ్యత్యాసాలను సరిచేసుకునే అవకాశం ఉంటుంది. వ్యక్తిగతంగా హాజరు కాలేని సందర్భాల్లో తమ తరఫున మరొకరిని విచారణకు పంపించే అవకాశం కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించినట్లు సమాచారం.