Singeetham Srinivasa Rao | చెన్నైలో కన్నీటి వీడ్కోలుకు ఏర్పాట్లు..
చెన్నైలో కన్నీటి వీడ్కోలుకు ఏర్పాట్లు..
- నెసపాక్కం శ్మశానవాటికలో అంతిమ సంస్కారాలు
- శనివారం రాత్రి కన్నుమూసిన దిగ్గజ దర్శకుడు..
- నివాళులర్పిస్తున్న సినీ ప్రముఖులు
చెన్నై, ఆంధ్రప్రభ : భారతీయ సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (94)కు నేడు అంతిమ వీడ్కోలు పలకనున్నారు. వయోభారంతో అనారోగ్యానికి గురైన ఆయన శనివారం రాత్రి చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతితో తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో విషాదం నెలకొంది.
మధ్యాహ్నం 3 గంటలకు అంత్యక్రియలు
సింగీతం శ్రీనివాసరావు పార్థివదేహాన్ని చెన్నైలోని విరుగంబాక్కంలోని ఆయన నివాసంలో ప్రజలు, కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం ఉంచారు. అభిమానులు, సహచరులు, సినీ ప్రముఖులు ఆయనకు నివాళులర్పిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో చెన్నై నెసపాక్కం శ్మశానవాటికలో సింగీతం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.
సినీ ప్రముఖుల సంతాపం
సింగీతం శ్రీనివాసరావు మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ నివాళులర్పించారు. కమల్ హాసన్, నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ తదితరులు సింగీతం మృతిపై సంతాపం తెలిపారు.
వైవిధ్యానికి చిరునామా.. సింగీతం
సింగీతం శ్రీనివాసరావు తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా, రచయితగా, సృజనాత్మక ఆలోచనాపరుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. విభిన్న కథాంశాలు, ప్రయోగాత్మక చిత్రీకరణ, హాస్యం, భావోద్వేగాలను తనదైన శైలిలో తెరపై ఆవిష్కరించారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన పలు చిత్రాలు ప్రేక్షకులపై చెరగని ముద్ర వేశాయి. దాదాపు ఐదు దశాబ్దాల సినీ ప్రస్థానంలో తెలుగు, తమిళం, హిందీ తదితర భాషల్లో పనిచేసిన సింగీతం.. భారతీయ సినిమా పరిధిని విస్తరించిన దర్శకుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ఆయన మరణంతో ఒక సృజనాత్మక శకం ముగిసిందంటూ సినీ వర్గాలు నివాళులర్పిస్తున్నాయి.
