గోదావరిఖని (ఆంధ్రప్రభ) : సింగరేణి బొగ్గు పరిశ్రమలో సార్వత్రిక సమ్మె విజయవంతమైంది (general strike successful). దేశవ్యాప్తంగా ఉన్న కార్మికుల హక్కుల సాధన కోసం చేపట్టిన ఒక్కరోజు సమ్మె సింగరేణి (Singareni) పరిశ్రమలో ఊహించని విధంగా సక్సెస్ అయ్యింది… నల్ల సూర్యులు సార్వత్రిక సమ్మెలో భాగస్వామ్యమయ్యారు. సింగరేణి వ్యాప్తంగా ఉన్న కోల్ బెల్ట్ ఏరియాలోని 11 డివిజన్లలో ఉన్న బొగ్గు గనులు… ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులలో పనిచేస్తున్న సుమారుగా 40,000మంది కార్మికులు సార్వత్రిక సమ్మెకు సై అంటూ… విధులకు గైర్హాజరయ్యారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సింగరేణిలో చేపట్టిన టోకెన్ సమ్మె తో బొగ్గు గనులన్నీ బోసిపోయాయి.
బొగ్గు ఉత్పత్తికి పెద్ద ఎత్తున ఆటంకం కలిగింది. ఒకరోజు సమ్మెతో 1.92 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలగగా.. ఒకరోజు సమ్మె మూలంగా సింగరేణి సంస్థ సుమారుగా 76కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూడాల్సిన పరిస్థితి కనిపించింది. దేశానికి వెలుగులను అందించే సింగరేణి బొగ్గు సంస్థలో ఒకరోజు టోకెన్ సమ్మె ఉత్పత్తికి నిజంగా పెద్ద ఎత్తున ఆటంకం కలిగించే పరిస్థితి ఎదురవడం యాజమాన్యం జీర్ణించుకోలేకపోతోంది. దేశవ్యాప్త సమ్మె (Nationwide strike) లో సింగరేణి బొగ్గు గని కార్మికులు పాల్గొనవద్దని పదేపదే యజమాన్యం చెప్పినా కార్మిక హక్కుల సాధన కోసం సమ్మె చేసి తీరుతామని కార్మిక సంఘాల పట్టుతో ఇక్కడ సింగరేణిలో సమ్మె పెద్ద ఎత్తున విజయవంతమైంది. సమ్మె ప్రభావంతో బొగ్గు రవాణా కు తీవ్ర ఆటంకం ఏర్పడింది. సింగరేణి బొగ్గు గనులు ఓపెన్ కాస్ట్లు అన్నీ కూడా నిర్మాణుష్యంగా కనిపించాయి. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. సమ్మె సందర్భంగా పోలీసులు పెద్ద ఎత్తున గనుల పరిసర ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు.

సింగరేణి కార్మిక సంఘాలు (Singareni Trade Unions) బుధవారం గోదావరిఖని పట్టణంలోని ప్రధాన చౌరస్తా వద్ద పెద్ద ఎత్తున మానవహారంగా ఏర్పడి కేంద్ర ప్రభుత్వ కార్మిక విధానాలను నిరసిస్తూ గళమెత్తారు. వేలాది మంది కార్మికులు ట్రేడింగ్ ల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఏఐటీయూసీ, ఐ ఎన్ టి యు సి, సిఐటియుల కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వేలాది మంది కార్మికులు కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ పోలికేక పెట్టారు. నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేసేంతవరకు ఉద్యమం ఆగదని హెచ్చరించారు.
సింగరేణి బొగ్గు పరిశ్రమలో దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేసేందుకు బొగ్గు పరిశ్రమకు చెందిన సింగరేణి కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పడి విజయవంతం కోసం విస్తృతంగా ప్రచారం చేపట్టారు. సింగరేణి పరిశ్రమలో బొగ్గు ఉత్పత్తుల లక్ష్యాన్ని 100శాతం చేదించాలన్న ఆలోచన విధానంతో యాజమాన్యం టార్గెట్ గా పెట్టుకుంటే… దేశవ్యాప్త సమ్మె సింగరేణి నిర్దేశిత లక్ష్యానికి నిజంగా ఆటంకం కలిగించిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ కు అప్పగించే కుట్రలో భాగమే కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని సింగరేణి కార్మిక సంఘాలు ఉమ్మడిగా ఆరోపించాయి.
