కోల్ ఇండియా పోటీల్లో సింగరేణి విజయపతాకం ఎగురవేయాలి
క్రీడాకారులకు జీఎం లలిత్ కుమార్ పిలుపు.. రూ.2.5 కోట్లతో క్రీడా మైదానం అభివృద్ధి
గోదావరిఖని, ఆంధ్రప్రభ: కోల్ ఇండియా స్థాయి క్రీడా పోటీల్లో సింగరేణి క్రీడాకారులు విజయాలు సాధించి సంస్థ కీర్తిని చాటాలని రామగుండం ఏరియా జీఎం డి. లలిత్ కుమార్ పిలుపునిచ్చారు.
బుధవారం గోదావరిఖనిలోని జవహర్లాల్ నెహ్రూ క్రీడా మైదానంలో సింగరేణి ఏరియా ఫుట్బాల్ పోటీలను ఆయన ప్రారంభించారు. వర్క్పీపుల్స్ గేమ్స్ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహించే ఈ పోటీల్లో సింగరేణిలోని వివిధ డివిజన్ల జట్లు పాల్గొంటున్నాయి. తొలిరోజు మణుగూరు-ఇల్లందు, బెల్లంపల్లి-మందమర్రి జట్లు తలపడ్డాయి. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. క్రీడలతో శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసం, క్రమశిక్షణ పెంపొందుతాయని అన్నారు. కోల్ ఇండియా పోటీల్లో సింగరేణి క్రీడాకారులు ఇప్పటికే బాడీబిల్డింగ్, వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ విభాగాల్లో ఐదు స్వర్ణాలు, ఆరు రజతాలు, రెండు కాంస్య పతకాలు సాధించారని అభినందించారు.
రూ.2.5 కోట్లతో క్రీడా మైదానం అభివృద్ధి
గోదావరిఖనిలోని జవహర్లాల్ నెహ్రూ క్రీడా మైదానాన్ని రూ.2.5 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు జీఎం తెలిపారు. ఇందులో నాలుగు లేన్ల సింథటిక్ ట్రాక్ ఏర్పాటు చేయడంతోపాటు భవిష్యత్తులో గ్రాస్ కోర్టును కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు, కార్మిక సంఘాల నాయకులు, క్రీడా ప్రతినిధులు పాల్గొన్నారు.
