అమరావతి : ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు రావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగిన సింగపూర్ పర్యటన విజయవంతమైందని రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. రూ. 45,000 కోట్ల పెట్టుబడులపై సంతకాలు జరిగాయని, ఇవన్నీ అమలు దశలో ఉన్నాయని ఆయన వెల్లడించారు. గురువారం సచివాలయంలో మీడియాతో మాట్లాడిన లోకేశ్, ఈ పర్యటన సందర్భంగా టీడీపీ ప్రభుత్వం కొత్త పెట్టుబడులను ఆకర్షించడంలో విజయం సాధించిందని అన్నారు.
దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్, డేటా సెంటర్లు ఏపీకి
నారా లోకేశ్ మాట్లాడుతూ.., “ఈ పర్యటన సందర్భంగా మేము కేవలం అవగాహన ఒప్పందాలపై సంతకం చేయలేదు. నేరుగా ఆచరణలోకి వచ్చే ప్రతిపాదనలను తీసుకువచ్చాము. ప్రతి ఒప్పందం పూర్తిగా అమలు దశకు చేరనుంది. ఇది మాటల వ్యవహారం కాదు… నిజమైన అభివృద్ధి వైపు ఒక అడుగు” అని ఆయన అన్నారు.
ఈ పెట్టుబడులలో ప్రముఖ కంపెనీ ఆర్సెలర్ మిట్టల్ కూడా ఉందని మంత్రి అన్నారు. “మేము జూమ్ కాల్ ద్వారా ఆర్సెలర్ మిట్టల్‌ను ఆహ్వానించాము. త్వరలో దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్‌తో పాటు అధునాతన డేటా సెంటర్లను ఏపీలో ఏర్పాటు చేస్తాము” అని ఆయన అన్నారు. ఇది రాష్ట్రానికి భారీ ఉపాధి అవకాశాలు, పారిశ్రామిక వృద్ధిని తెస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.
జగన్ పాలనలో ఏపీ బ్రాండ్ నాశనం
జగన్ పాలనపై తీవ్ర విమర్శలు చేసిన లోకేశ్, “గత ఐదేళ్లలో ఏపీ బ్రాండ్ విలువ పూర్తిగా తగ్గిపోయింది. అప్పట్లో సింగపూర్ ప్రభుత్వం అమరావతిని సంయుక్తంగా అభివృద్ధి చేద్దామనగా, జగన్ ప్రభుత్వం అగ్రగామి ఆలోచనలను పక్కన పెట్టి ఒప్పందాలను రద్దు చేసింది. పారదర్శకతకు నిలయమైన సింగపూర్‌పై అవినీతి ఆరోపణలు చేస్తూ, ఆ నమ్మకాన్ని ధ్వంసం చేశారు” అని మండిపడ్డారు. “వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో రాష్ట్రానికి ఎలాంటి పెద్ద పెట్టుబడులు రాలేదు. కానీ కూటమి ప్రభుత్వం కేవలం 14 నెలల్లోనే భారీగా పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చింది. ఇది తేడా ఎలా ఉండాలో చూపిస్తోంది” అని లోకేశ్ గర్వంగా పేర్కొన్నారు.
విశాఖను ఐటీ హబ్‌గా అభివృద్ధి చేస్తాం
టీసీఎస్‌కు విశాఖలో ఒక్కో ఎకరా భూమిని 99 పైసలకే కేటాయించామని, ఇది ఉద్యోగాల కోసం తీసుకున్న చారిత్రక నిర్ణయమని లోకేశ్ తెలిపారు. “వైసీపీ నేతలు దీనిని కోర్టుకు లాగారు. తక్కువ ధరకు భూమిని మేం హెరిటేజ్‌కు కూడా ఇవ్వలేదు. టీసీఎస్‌కు ఇచ్చాం – ఎందుకంటే అది లక్షల ఉద్యోగ అవకాశాలను తెస్తుంది. భవిష్యత్తు కోసం పెట్టిన పెట్టుబడికి ఇది మద్దతు” అని అన్నారు.
“విశాఖ నగరానికి ఐటీ రంగంలో ప్రత్యేక స్థానం కల్పించేందుకు మేం కృషి చేస్తున్నాం. ఇప్పటికే TCS, Infosys వంటి దిగ్గజాలను ఆకర్షించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. విశాఖను దేశవ్యాప్తంగా గుర్తింపు పొందే ఐటీ పటంలో చేర్చేందుకు నిర్ణయం తీసుకున్నాం” అని తెలిపారు.