BWF World Tour ఫైనల్స్‌కు సింధు..

చెన్నై, ఆంధ్రప్రభ :

భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు 2026 బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. ఈ విషయాన్ని బుధవారం ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) ప్రకటించింది. సింధు కెరీర్‌లో ఈ టోర్నీకి అర్హత సాధించడం ఇది ఆరోసారి కాగా.. 2021 తర్వాత తొలిసారి ఫైనల్స్‌లో ఆడనుంది.

2022లోనూ సింధు ఈ టోర్నీకి అర్హత సాధించినప్పటికీ, గాయం కారణంగా వైదొలిగింది. ఈ ఏడాది డిసెంబరు 9 నుంచి 13 వరకు చైనాలోని హాంగ్‌జౌలో వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ జరగనున్నాయి. సింధుతో పాటు ఆన్‌ సె యంగ్‌, అకానె యమగుచి, వాంగ్‌ జి యి, చెన్‌ యు ఫెయి కూడా టోర్నీకి అర్హత సాధించారు.

గత వారం జర్మనీలో జరిగిన హైలో ఓపెన్‌లో సింధు విజేతగా నిలిచింది. తదుపరి నవంబరు 24 నుంచి లక్నోలో ప్రారంభమయ్యే సయ్యద్‌ మోదీ అంతర్జాతీయ టోర్నీలో ఆమె బరిలోకి దిగే అవకాశం ఉంది.

2018 వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ మహిళల సింగిల్స్‌ ఫైనల్లో జపాన్‌ క్రీడాకారిణి నొజోమి ఒకుహారాను ఓడించి సింధు టైటిల్‌ సాధించింది. ఈ టోర్నీలో మహిళల సింగిల్స్‌ టైటిల్‌ గెలిచిన ఏకైక భారత క్రీడాకారిణిగా ఆమె కొనసాగుతోంది.