Siddipet BJP–Congress Clash | సిద్దిపేటలో కాంగ్రెస్‌–బీజేపీ బాహాబాహీ.. రాజకీయ ఉద్రిక్త‌త‌!

  • సేవా జ్యోతి కలశ యాత్రలో ఉద్రిక్తత.. మోదీ దిష్టిబొమ్మ దహన యత్నం
  • మహిళా నాయకురాళ్ల మధ్య తోపులాట.. జుట్లు పట్టుకుని ఘర్షణ
  • నినాదాలు, ధర్నాలతో దద్దరిల్లిన జిల్లా కేంద్రం

Siddipet BJP–Congress Clash | సిద్దిపేట బ్యూరో, ఆంధ్రప్రభ: సిద్దిపేట జిల్లా కేంద్రం.. రాజ‌కీయ ర‌ణ‌రంగంగా మారింది. బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సేవా జ్యోతి కలశ యాత్ర’ సందర్భంగా కాంగ్రెస్‌, బీజేపీ శ్రేణుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. కాంగ్రెస్‌ నాయకులు ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించగా.. బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. మహిళా నాయకురాళ్ల మధ్య కూడా ఘర్షణ చోటుచేసుకుని జుట్లు పట్టుకునే వరకు వెళ్లింది. పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను చెదరగొట్టి పలువురిని వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

యాత్రలోనే కలకలం

ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో ‘సేవా జ్యోతి కలశ యాత్ర’ నిర్వహించారు. కొండ భూదేవి గార్డెన్‌ నుంచి ప్రారంభమైన ర్యాలీ పాత బస్టాండ్‌, మెదక్‌ రోడ్డు మీదుగా వెంకటేశ్వరస్వామి ఆలయం, గాంధీచౌక్‌ వైపు సాగింది. జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చాయి.

గాంధీచౌక్‌ వద్దకు ర్యాలీ చేరుకున్న సమయంలో కాంగ్రెస్‌ నాయకులు అక్కడికి చేరుకుని నిరసనకు దిగారు. రాహుల్‌గాంధీ అరెస్టును నిరసిస్తూ మోదీ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించినట్లు స్థానికలు పేర్కొన్నారు. బీజేపీ నాయకులు వారిని అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం మొదలై.. కొద్దిసేపటికే తోపులాటకు దారితీసింది.

మహిళా నాయకురాళ్ల మధ్య ఘర్షణ

ఆందోళనలో మహిళా నాయకురాళ్లు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇరువర్గాల మధ్య పరిస్థితి అదుపుతప్పడంతో మహిళా కార్యకర్తలు ఒకరినొకరు పట్టుకోవడం, తోసుకోవడం చోటుచేసుకుంది. చివరకు జుట్లు పట్టుకునే స్థాయికి ఘర్షణ చేరడంతో అక్కడున్నవారు ఆందోళనకు గురయ్యారు. పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

పోలీసుల అదుపులో పలువురు

ఘటన సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే గాంధీచౌక్‌కు చేరుకున్నారు. ఇరువర్గాలను అక్కడి నుంచి చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఆందోళనకు పాల్పడిన కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తల్లో పలువురిని వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఉద్రిక్తత మరింత పెరగకుండా జిల్లా కేంద్రంలోని కీలక ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

పోలీస్‌స్టేషన్‌ ఎదుట బీజేపీ ధర్నా

బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ వద్దకు చేరుకున్నాయి. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్‌ ముదిరాజ్‌ ఆధ్వర్యంలో అక్కడ ధర్నా నిర్వహించారు. శాంతియుతంగా అనుమతితో ర్యాలీ నిర్వహిస్తుండగా కాంగ్రెస్‌ నాయకులు వచ్చి ఉద్రిక్తత సృష్టించారని బీజేపీ నాయకులు ఆరోపించారు.

ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ నినాదాలు చేశారు. ‘ఇదేమి రాజ్యం.. ఇదేమి రాజ్యం’, ‘కాంగ్రెస్‌ నేతల్లారా ఖబడ్దార్‌’ అంటూ నినాదాలతో పోలీస్‌స్టేషన్‌ పరిసరాలు మార్మోగాయి. ఏసీపీ రవీందర్‌రెడ్డి అక్కడికి చేరుకుని బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో బీజేపీ నాయకులు ఆందోళన విరమించారు.

కాంగ్రెస్‌ నాయకురాళ్లకు డీసీసీ అధ్యక్షురాలి పరామర్శ

సిద్దిపేటలో ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలుసుకున్న డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని అక్కడ ఉన్న కాంగ్రెస్‌ మహిళా నాయకురాళ్లను పరామర్శించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వారికి భరోసా కల్పించారు. రాహుల్‌గాంధీ అరెస్టును ఖండిస్తూ.. కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలపై దాడులను సహించేది లేదని ఆమె పేర్కొన్నారు. తమ పార్టీ మహిళా నాయకురాళ్లపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

చట్ట ఉల్లంఘనపై చర్యలు: ఏసీపీ

సిద్దిపేటలో చోటుచేసుకున్న ఘటనపై ఏసీపీ రవీందర్‌రెడ్డి స్పందించారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా పోలీసులు సకాలంలో జోక్యం చేసుకున్నారని చెప్పారు. ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో అదనపు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

రాజకీయ వేడి.. పోలీసులకు సవాల్‌

ఒకే ప్రాంతంలో బీజేపీ ర్యాలీ, కాంగ్రెస్‌ నిరసన కార్యక్రమాలు ఒకేసారి జరగడంతో సిద్దిపేటలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. దిష్టిబొమ్మ దహన యత్నాన్ని అడ్డుకునే క్రమంలో మొదలైన వాగ్వాదం తోపులాటకు, అక్కడి నుంచి మహిళా నాయకురాళ్ల మధ్య ఘర్షణకు దారితీసింది. పోలీసులు వెంటనే జోక్యం చేసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చినప్పటికీ.. ఈ ఘటనతో జిల్లా కేంద్రంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.