శ్రేయస్‌ శతక బాదుడు.. విండీస్‌పై భారత్‌ ఘన విజయం. !

  • సెంచరీతో చెలరేగిన శ్రేయస్‌..
  • ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యం

లక్నో, ఆంధ్రప్రభ : వెస్టిండీస్‌తో తొలి టీ20లో టీమిండియా అదరగొట్టింది. 172 పరుగుల లక్ష్యాన్ని కేవలం 14.4 ఓవర్లలోనే ఛేదించి ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ అద్భుత శతకంతో చెలరేగగా.. ఇషాన్‌ కిషన్‌ అతడికి అండగా నిలిచాడు. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌.. విండీస్‌ను 19.1 ఓవర్లలో 171 పరుగులకే కట్టడి చేసింది. షై హోప్‌, షెర్ఫేన్‌ రూథర్‌ఫోర్డ్‌ అర్ధశతకాలతో రాణించినా.. మిగతా బ్యాటర్ల నుంచి ఆశించిన స్థాయిలో సహకారం లభించలేదు. భారత బౌలర్లలో టీ20 అరంగేట్రం చేసిన నమన్‌ ధీర్‌ మూడు వికెట్లు పడగొట్టాడు. ప్రతి వికెట్‌కు ముందు ఓ సిక్స్‌ ఇచ్చి మరుసటి బంతికే బ్యాటర్‌ను పెవిలియన్‌కు పంపడం విశేషం.

ఇక‌ లక్ష్య ఛేదనలో అభిషేక్‌ శర్మ, సంజు శాంసన్‌ భారత్‌కు మెరుపు ఆరంభాన్ని అందించారు. ఇద్దరూ పవర్‌ప్లేలోనే వెనుదిరిగినా.. ఆ తర్వాత శ్రేయస్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌ కలిసి ఎలాంటి తడబాటుకు తావివ్వలేదు. శ్రేయస్‌ 43 బంతుల్లో 102 పరుగులతో అజేయ శతకం సాధించాడు. ఇషాన్‌ కిషన్‌ 37 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో భారత్‌ 32 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని అందుకుంది.

ఈ సెంచరీతో శ్రేయస్‌ అయ్యర్‌ మరో ఘనత సాధించాడు. పురుషుల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్‌కు కెప్టెన్‌గా ముందు రోహిత్‌ శర్మ (మూడు శతకాలు), సూర్యకుమార్‌ యాదవ్ (ఒక శతకం) త‌రువాత శతకం సాధించిన మూడో కెప్టెన్ గా నిలిచాడు. అలాగే టీ20ల్లో శ్రేయస్‌కు ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు. ఇంగ్లాండ్‌పై బ్రిస్టల్‌లో చేసిన 80 నాటౌట్‌ను అధిగమించి 102 నాటౌట్‌తో కొత్త రికార్డు నెలకొల్పాడు.

కెప్టెన్‌గా తొలి ఏడు మ్యాచ్‌ల్లో ఆరు ఓటములు ఎదుర్కొన్న శ్రేయస్‌.. ఇప్పుడు వరుసగా 10 విజయాలతో దూసుకెళ్తున్నాడు. కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్‌లోనూ అదరగొడుతూ టీమిండియాకు మరో విజయాన్ని అందించాడు.