Indrakeeladri | శ్రావణ శుక్రవారం.. కిటకిటలాడిన ఇంద్రకీలాద్రి..

వరలక్ష్మీదేవిగా కనువిందు చేసిన అమ్మవారు
సామూహిక వరలక్ష్మీ వ్రతాలతో ఆధ్యాత్మిక సందడి
కృష్ణాష్టమి వేడుకల్లో ఉట్టికొట్టే కార్యక్రమం
ఒక్కరోజే 64,481 మంది భక్తుల దర్శనం
68,098 లడ్డూల విక్రయం.. రూ.1.58 లక్షల విరాళాలు


Indrakeeladri | (ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ) : శ్రావణమాసం చివరి శుక్రవారం.. కృష్ణాష్టమి వేడుకలు ఒకేసారి రావడంతో విజయవాడ ఇంద్రకీలాద్రి భక్తజన సందోహంతో కిటకిటలాడింది. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో శుక్రవారం ఉదయం నుంచే అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్దఎత్తున తరలిరావడంతో ఆలయ ప్రాంగణం, క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. శ్రావణమాసం చివరి శుక్రవారం సందర్భంగా శ్రీ కనకదుర్గమ్మవారు వరలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

ఈ సందర్భంగా ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలను ఘనంగా నిర్వహించారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, వ్రతాలు నిర్వహించారు. మరోవైపు కృష్ణాష్టమి సందర్భంగా ఆలయ పరిసరాల్లో శ్రీకృష్ణునికి సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. సాయంత్రం ఉట్టికొట్టే కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

శుక్రవారం వివరాలు..

శ్రావణమాసం చివరి శుక్రవారం, కృష్ణాష్టమి రెండూ ఒకేసారి రావడంతో ఇంద్రకీలాద్రిపై ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆధ్యాత్మిక సందడి నెలకొంది. దేవస్థానం గణాంకాల ప్రకారం శుక్రవారం 64,481 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనం కోసం 9,627 టికెట్లు జారీ కాగా, 494 సేవలు నిర్వహించారు. 68,098 ప్రసాద యూనిట్లు విక్రయమయ్యాయి. కేశఖండన కార్యక్రమంలో 2,011 మంది పాల్గొన్నారు. అన్నదానంలో 1,190 మంది భక్తులకు భోజన సదుపాయం కల్పించారు. భక్తుల నుంచి రూ.1,58,028 విరాళాలు లభించాయి.