పీహెచ్‌సీల్లో మందుల కొరత.. ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం: మెతుకు ఆనంద్
వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ నియోజకవర్గంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన మందులు అందుబాటులో లేకపోవడంపై మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆందోళన వ్యక్తం చేశారు. గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గాంధీ పార్కులో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రామయ్యగూడ పీహెచ్‌సీని సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు.
ఈ సందర్భంగా డాక్టర్ మెతుకు ఆనంద్ మాట్లాడుతూ.. ముందుగా ప్రజలకు మహాత్మా గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. గాంధీజీ చూపిన సత్యం, అహింస మార్గాలకు విరుద్ధంగా ప్రస్తుత పాలన సాగుతోందని విమర్శించారు.
గర్భిణులకు అత్యవసరమైన ఐరన్, కాల్షియం మాత్రలు కూడా అందుబాటులో లేకపోవడం బాధాకరమని అన్నారు. వికారాబాద్ నియోజకవర్గంలోని పీహెచ్‌సీల్లో మందులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ నియోజకవర్గంలోని పీహెచ్‌సీల్లో మందుల కొరతను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రామయ్యగూడ పీహెచ్‌సీ ఒక్కటే కాకుండా వికారాబాద్ నియోజకవర్గంలోని అన్ని పీహెచ్‌సీల్లో ప్రజలకు అవసరమైన మందులను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం వీడి తక్షణమే మందుల కొరతను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
