హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా శివధర్ రెడ్డి నియమితులయ్యారు. 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఆయన ప్రస్తుతం రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, ఆయన అక్టోబర్ 1న అధికారికంగా డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
హైదరాబాద్‌లో జన్మించిన శివధర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తూలేకలాన్ (పెద్దతుండ్ల) గ్రామానికి చెందినవారు. ప్రాథమిక విద్యనుంచి ఉన్నత విద్య వరకు హైదరాబాద్‌లోనే చదివారు. ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి కొంతకాలం న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. అనంతరం సివిల్ సర్వీసెస్‌లో క్లియర్ చేసి 1994లో భారత పోలీస్ సర్వీసులో చేరారు.
పోలీస్ కెరీర్..
అనకాపల్లి, నర్సీపట్నం, చింతపల్లి ప్రాంతాల్లో ఏఎస్పీగా పని చేసిన ఆయన, గ్రేహౌండ్స్ స్క్వాడ్రన్ కమాండర్‌గా కూడా సేవలందించారు. బెల్లంపల్లి, ఆదిలాబాద్, నల్గొండ, శ్రీకాకుళం, నెల్లూరు, గుంటూరు జిల్లాల ఎస్పీగా విధులు నిర్వహించారు. మావోయిస్టు వ్యతిరేక చర్యల్లో కీలకపాత్ర పోషించి గుర్తింపు తెచ్చుకున్నారు.
2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తొలి ఇంటెలిజెన్స్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన శివధర్ రెడ్డి, 2016లో జరిగిన నయీం ఎన్‌కౌంటర్ ఆపరేషన్‌ను సూత్రప్రాయంగా రూపకల్పన చేశారు. అంతకుముందు 2007లో మక్కా మసీదు పేలుళ్ల తర్వాత ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల్లో హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా ప్రజల్లో నమ్మకం కలిగించి శాంతిభద్రతలను కాపాడారు.
విశాఖపట్నం పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన సమయంలో రోడ్ సేఫ్టీపై Arrive Alive క్యాంపెయిన్‌ను విజయవంతంగా అమలు చేశారు. అదేవిధంగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏసీబీ అదనపు డైరెక్టర్, డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. పర్సనల్ వింగ్‌లో ఐజీ, అడిషనల్ డీజీగా సేవలందించారు.
అంతర్జాతీయ అనుభవం
శివధర్ రెడ్డి ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళంలో భాగంగా United Nations Mission in Kosovo (UNMIK)లో పనిచేసి అంతర్జాతీయ స్థాయిలో కూడా అనుభవాన్ని సొంతం చేసుకున్నారు.
అవార్డులు & గౌరవాలు
తన ప్రొఫెషనల్ కెరీర్‌లో గ్యాలంట్రీ మెడల్, పోలీస్ మెడల్, ప్రెసిడెంట్ మెడల్, యుఎన్ మెడల్ వంటి అనేక పురస్కారాలు అందుకున్నారు. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న శివధర్ రెడ్డి, అక్టోబర్ 1 నుంచి రాష్ట్ర పోలీస్ విభాగానికి అగ్ర నాయకత్వం వహించనున్నారు.


