లారీ–ఆటో ఢీ.. ముగ్గురు దుర్మరణం
షికారుగంజి జంక్షన్ వద్ద ప్రమాదం..
స్వీట్ జొన్నలు విక్రయించి తిరిగొస్తుండగా విషాదం
దత్తిరాజేరు, ఆంధ్రప్రభ: మండలంలోని షికారుగంజి జంక్షన్ వద్ద ఆదివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. లారీ ఆటోను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుల్లో పెదమానాపురం గ్రామానికి చెందిన గుడ్ల రాము, బాడంగి మండలం గజరాయినివలస గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ గుణుపూరి తిరుపతి, తెర్లి ఆదినారాయణ ఉన్నారు. వీరు ముగ్గురూ ఘటన స్థలంలోనే మృతి చెందినట్లు సమాచారం. గజరాయినివలస నుంచి ఆటోలో స్వీట్ జొన్నలు తీసుకుని విజయనగరం వెళ్లి విక్రయించిన అనంతరం తిరిగి ఇంటికి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలిసింది.
గుణుపూరి తిరుపతి, తెర్లి ఆదినారాయణ చుట్టుపక్కల గ్రామాల్లో స్వీట్ జొన్నలు కొనుగోలు చేసి విజయనగరం వెళ్లి విక్రయిస్తూ జీవనం సాగించేవారు. గుడ్ల రాము గ్రామాల్లో ఎండుచేపలు విక్రయిస్తూ జీవనం సాగించేవాడు. ముగ్గురి మృతితో ఆయా గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఎస్.బూర్జివలస ఎస్‌ఐ ప్రయాగమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
