ఇమ్రాన్ ఖాన్‌ను ఆస్పత్రికి తరలించండి..
- పాక్ సుప్రీంకోర్టు ఆదేశం
- ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన..
- 48 గంటల్లో ప్రైవేటు ఆస్పత్రికి తరలింపు
ఇస్లామాబాద్, ఆంధ్రప్రభ : జైల్లో ఉన్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను ఆసుపత్రికి తరలించాలని ఆ దేశ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందన్న ఆందోళనల నేపథ్యంలో ఈ ఆదేశాలు వెలువడ్డాయి. పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ నేతలు, ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యులు చాలాకాలంగా చేస్తున్న విజ్ఞప్తికి సుప్రీంకోర్టు స్పందించింది.
73 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్‌ను రావల్పిండిలోని అదియాలా జైలులో నుంచి ఇస్లామాబాద్‌లోని షిఫా ఇంటర్నేషనల్ ఆసుపత్రికి 48 గంటల్లో తరలించాలని కోర్టు ఆదేశించినట్లు పీటీఐ అధికార ప్రతినిధి నయీమ్ హైదర్ పంజూతా తెలిపారు. సెప్టెంబర్ 16 వరకు ఆయనను ఆసుపత్రిలోనే ఉంచాలని ఆదేశించినట్లు వెల్లడించారు.
ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిని సమగ్రంగా పరిశీలించేందుకు వైద్య నిపుణులతో ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ బృందంలో ఆయన వ్యక్తిగత వైద్యుడు, సోదరి డాక్టర్ ఉజ్మా ఖాన్ కూడా ఉండనున్నట్లు పీటీఐ వర్గాలు తెలిపాయి. కుటుంబ సభ్యులతో వారానికి ఒకసారి సమావేశం అయ్యేందుకు కూడా కోర్టు అనుమతి ఇచ్చింది.
అయితే ఇమ్రాన్ ఖాన్ వైద్య నివేదికలను మీడియాకు విడుదల చేయవద్దని, ఆరోగ్య అంశాన్ని రాజకీయ వివాదంగా మార్చవద్దని ఆయన కుటుంబ సభ్యులు, న్యాయవాదులను సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఆరోగ్యంపై కొంతకాలంగా ఆందోళన
ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుటుంబ సభ్యులు గత ఏడాది నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జైలులో ఉన్న సమయంలో ఆయన కుడి కంటిచూపు గణనీయంగా తగ్గినట్లు ఆయన న్యాయవాదులు గతంలో కోర్టుకు తెలిపారు. అయితే వైద్య బృందం నిర్వహించిన పరీక్షల అనంతరం కంటి చూపులో కొంత మెరుగుదల కనిపించినట్లు సమాచారం.
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ కూడా ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన వైద్య నివేదికలను పరిశీలించిన తర్వాత ఆందోళన కలిగించే అంశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా తీవ్ర ఒత్తిడి, గుండె దడ, అధిక రక్తపోటు వంటి సమస్యలపై ఆయన దృష్టి సారించారు. మూడు సంవత్సరాలుగా జైలు జీవితం, కుటుంబ సభ్యులకు దూరంగా ఉండటం ఇమ్రాన్ ఖాన్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని అల్వీ అభిప్రాయపడ్డారు.
ఆలస్యంగానైనా మంచి నిర్ణయం..
సుప్రీంకోర్టు ఆదేశాలను ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ స్వాగతించింది. ఈ నిర్ణయం మరింత ముందే వచ్చి ఉంటే ఆయన కంటి చూపు, మొత్తం ఆరోగ్యం ఇంతగా దెబ్బతినేది కాదని పార్టీ ప్రతినిధి జుల్ఫికర్ బుఖారీ అన్నారు. వైద్యులు పూర్తిగా సంతృప్తి చెందే వరకు ఇమ్రాన్ ఖాన్‌ను ఆసుపత్రిలోనే ఉంచాలని ఆయన కోరారు.
2023 నుంచి జైల్లోనే..
2022లో అవిశ్వాస తీర్మానం ద్వారా ప్రధాని పదవిని కోల్పోయిన తర్వాత ఇమ్రాన్ ఖాన్‌పై పలు కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ కానుకలు, అక్రమ వివాహం సహా వివిధ కేసుల్లో ఆయనకు శిక్షలు కూడా విధించారు. అయితే తనపై నమోదైన కేసులన్నీ రాజకీయ ప్రేరేపితమైనవేనని ఇమ్రాన్ ఖాన్ ఆరోపిస్తున్నారు. కొన్ని కేసుల్లో ఆయనకు విధించిన శిక్షలు నిలిపివేయబడగా, మరికొన్ని కేసుల్లో అప్పీళ్లు కొనసాగుతున్నాయి. 2023 ఆగస్టు నుంచి ఆయన అదియాలా జైలులో ఉన్నారు.
ఇమ్రాన్ ఖాన్ జైలు పరిస్థితులపై గతంలో భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా పలువురు మాజీ క్రికెటర్లు, క్రికెట్ దిగ్గజాలు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఫిబ్రవరిలో ఆయనకు మెరుగైన వైద్యం, జైలు పరిస్థితులు కల్పించాలని కోరుతూ పలువురు క్రికెటర్లు స్పందించారు.
2018లో పాకిస్థాన్‌లో అధికారంలోకి వచ్చిన ఇమ్రాన్ ఖాన్ పార్టీకి ఇప్పటికీ దేశంలోని కీలక ప్రాంతాల్లో గణనీయమైన ప్రజాదరణ ఉంది. అయితే 2024 ఎన్నికలకు ముందు ఆ పార్టీ ఎన్నికల గుర్తును కోల్పోవడంతో పీటీఐ మద్దతుదారులు స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల్లో పోటీ చేయాల్సి వచ్చింది.
