బుడమేరు ముంపు నివారణ ఏదీ?
రూ.5,222 కోట్ల డీపీఆర్ బుట్టదాఖలు.. రెండేళ్లయినా శాశ్వత చర్యలు శూన్యం
విజయవాడ, ఆంధ్రప్రభ: బుడమేరు ముంపు నివారణకు శాశ్వత చర్యలు చేపట్టడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్. బాబూరావు విమర్శించారు. 2024 ఆగస్టు 31 అర్ధరాత్రి సంభవించిన బుడమేరు వరదలకు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా విజయవాడ బుడమేరు వంతెన వద్ద సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రూ.5,222 కోట్లతో అధికారులు రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను ప్రభుత్వం ఇప్పటికైనా ఆమోదించి నిధులు విడుదల చేయాలని బాబూరావు డిమాండ్ చేశారు. కొల్లేరు వరకు బుడమేరును లోతు, వెడల్పు చేయడంతో పాటు విజయవాడ సమీపంలో సమాంతర కాలువ నిర్మాణం చేపట్టాలని కోరారు. రక్షణ గోడ, మళ్లింపు కాలువ సామర్థ్యాన్ని పెంచడం, వెలగలేరు నియంత్రణ వ్యవస్థను అభివృద్ధి చేయడం, ఎగువ ప్రాంతాల్లో జలాశయాలు నిర్మించడం వంటి శాశ్వత చర్యలు చేపట్టాలని సూచించారు.
2024 వరదల్లో పెద్దఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం జరిగినప్పటికీ ప్రభుత్వం శాశ్వత పరిష్కారంపై తగిన దృష్టి పెట్టలేదని బాబూరావు ఆరోపించారు. స్వల్ప వర్షానికే బుడమేరు పరివాహక ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు. అమరావతిలో ముంపు నివారణకు ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం విజయవాడ పరిసర ప్రాంతాల రక్షణను విస్మరించడం సరికాదన్నారు.
వరదల సమయంలో సీపీఎం ఆధ్వర్యంలో 15 కేంద్రాల్లో సుమారు 1.75 లక్షల మందికి భోజనం అందించి బాధితులకు అండగా నిలిచామని బాబూరావు తెలిపారు. ముఖ్యమంత్రి తక్షణమే ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి బుడమేరు ముంపు నివారణ చర్యలపై సమీక్షించాలని, సమగ్ర ప్రాజెక్టు నివేదికకు అనుగుణంగా నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు డి. కాశీనాథ్, నేతలు బి. రమణారావు, కే. దుర్గారావు, టీ. ప్రవీణ్, సీహెచ్. శ్రీనివాస్, పీరు సాహెబ్, వై. సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
