షర్మిల కుమార్తెకు పెళ్లి ఫిక్స్‌!

అమెరికా వైద్యుడితో అంజలి రెడ్డి వివాహం
వరుడి కుటుంబ మూలాలు కర్నూలు జిల్లాలోనే..
పెళ్లి తేదీ, వేదికపై త్వరలో స్పష్టత

అమరావతి, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల, అనిల్‌కుమార్‌ దంపతుల కుమార్తె వైఎస్‌ అంజలి రెడ్డి వివాహం నిశ్చయమైంది. అమెరికాలో వైద్యుడిగా స్థిరపడిన డాక్టర్‌ సోమాల రఘురామ్‌రెడ్డితో ఆమె వివాహం జరగనుంది. ఈ విషయాన్ని వైఎస్‌ షర్మిల స్వయంగా సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. కాబోయే వధూవరుల ఫొటోలను సైతం పంచుకుంటూ తమ కుటుంబంలో నెలకొన్న ఈ ఆనందకర సందర్భాన్ని అభిమానులు, స్నేహితులు, శ్రేయోభిలాషులతో పంచుకున్నారు.

డాక్టర్‌ సోమాల రఘురామ్‌రెడ్డి కుటుంబం ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందినది. ప్రస్తుతం ఆయన కుటుంబ సభ్యులంతా అమెరికాలో స్థిరపడి అక్కడి పౌరసత్వం పొందినట్లు షర్మిల కుటుంబం వెల్లడించింది. రఘురామ్‌రెడ్డి అమెరికాలో వైద్యుడిగా కొనసాగుతున్నారు. ఆయన తల్లిదండ్రులు సోమాల సుబ్బారెడ్డి, సోమాల పద్మారెడ్డి. కర్నూలు జిల్లా మూలాలున్న రెండు కుటుంబాల మధ్య ఈ వివాహ బంధం ఏర్పడనుండటం విశేషంగా మారింది.

తమ కుమార్తె అంజలి రెడ్డి జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం కానున్న నేపథ్యంలో షర్మిల, అనిల్‌కుమార్‌ దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ శుభ సందర్భంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, అభిమానులు తమ కుమార్తెకు ప్రార్థనలు, ఆశీస్సులు అందించాలని కోరారు. భగవంతుడి ఆశీస్సులతో అంజలి రెడ్డి, రఘురామ్‌రెడ్డి దంపతుల జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.

కాగా, వివాహ నిశ్చితార్థం, పెళ్లి కార్యక్రమాలు ఎప్పుడు, ఎక్కడ నిర్వహించనున్నారనే వివరాలను కుటుంబ సభ్యులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. వివాహ తేదీ, వేదికపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అంజలి రెడ్డి వివాహ నిశ్చయం వైఎస్‌ షర్మిల కుటుంబంలో ఆనందాన్ని నింపింది.