హోదా పక్కనపెట్టి.. నేలపై కూర్చొని పూజలు!

సూర్యనారాయణ స్వామి ఆలయంలో కలెక్టర్‌ రాజకుమారి గణియా ప్రత్యేక పూజలు
నందికొట్కూరు, ఆంధ్రప్రభ:
నంద్యాల జిల్లా కలెక్టర్‌ రాజకుమారి గణియా నిరాడంబరతను చాటుకున్నారు. నందికొట్కూరు పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని సందర్శించిన ఆమె.. ప్రోటోకాల్‌కు దూరంగా సామాన్య భక్తురాలిలా నేలపై కూర్చొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అర్చకులు వేదమంత్రాల నడుమ పూజలు చేయగా, కలెక్టర్‌ భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. జిల్లా ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని స్వామివారిని ప్రార్థించారు. అనంతరం అర్చకులు ఆమెకు తీర్థప్రసాదాలు అందజేశారు. కలెక్టర్‌ నిరాడంబరత, భక్తిశ్రద్ధలను చూసి స్థానిక భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.