ఆర్టీసీ ఎన్నికల వేళ టీజేఎంయూకు షాక్..
- టీజేఎంయూకు అనంత కిషన్ రాజీనామా
- టీడబ్ల్యూయూకు మద్దతుగా నిర్ణయం
సంగారెడ్డి, ఆంధ్రప్రభ: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల ఎన్నికలకు మరో మూడు రోజులు మాత్రమే గడువు ఉండగా సంగారెడ్డి డిపోలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ (టీజేఎంయూ) సంగారెడ్డి డిపో గౌరవ అధ్యక్ష పదవికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత కిషన్ మంగళవారం రాత్రి రాజీనామా చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ (టీడబ్ల్యూయూ)కు మద్దతు ఇస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
మీడియా సమావేశంలో అనంత కిషన్ మాట్లాడుతూ.. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు టీజేఎంయూ సంగారెడ్డి డిపో గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం మేరకు ఈ నెల 9న జరగనున్న ఆర్టీసీ కార్మికుల ఎన్నికల్లో టీడబ్ల్యూయూను గెలిపించేందుకు శాయశక్తులా కృషి చేస్తామని స్పష్టం చేశారు. పార్టీ ఆదేశాలను అనుసరిస్తూ కార్మికుల ప్రయోజనాల కోసం టీడబ్ల్యూయూకు మద్దతుగా నిలుస్తున్నట్లు పేర్కొన్నారు.
ఎన్నికల సమయంలో అనంత కిషన్ రాజీనామా చేయడం సంగారెడ్డి ఆర్టీసీ డిపోలో రాజకీయంగా, కార్మిక సంఘాల పరంగా ప్రాధాన్యం సంతరించుకుంది. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు కూన సంతోష్, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ షఫీ హఫీజ్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కిరణ్ గౌడ్, గంగేరి శ్రీహరి పాల్గొన్నారు.
