కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సుప్రీంలో షాక్

ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్‌డెస్క్‌: కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను తాత్కాలికంగా సస్పెండ్ చేయాలన్న పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు నిరాకరించింది.

ఎన్నికల సంఘం నిర్ణయాలు ఏకగ్రీవంగానే తీసుకున్నారా? లేక సీఈసీ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారా? అనే అంశంపై ఈసీతో పాటు సీఈసీ, మ‌రో ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషీలకు నోటీసులు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తులు జోయ్‌మాల్య బాగ్చీ, వి. మోహనలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించింది. ఎన్నికల సంఘం నిర్ణయాలు ఏకాభిప్రాయంతో ఉండాలని స్పష్టం చేశారు. అలా కుదరకపోతే మెజారిటీ ఆధారంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.
కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తి జోయ్‌మాల్య బాగ్చీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘం రికార్డుల్లో కొన్ని నిర్ణయాలు ఏకగ్రీవంగా తీసుకోలేదని తేలితే, వాటి అమలును నిలిపివేసి అవి చట్టపరంగా చెల్లుబాటు కావని ప్రకటించే అవకాశం ఉందని తెలిపారు. ఈ అంశంపై ఎన్నికల సంఘం సభ్యుల నుంచి వివరణ కోరారు.
సస్పెన్షన్ కుద‌రదు.. విచారణ సిద్ధం
ప్రస్తుతం జ్ఞానేశ్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి ధర్మాసనం నిరాకరించింది. ఎన్నికల సంఘం, సీఈసీ, ఇతర ఇద్దరు కమిషనర్లకు నోటీసులు జారీ చేసి వారి వివరణ కోరింది. కేసు విచారణ కొనసాగనుంది.