తొలి భారత రికర్వ్‌ స్వర్ణ వీరుడిగా రికార్డు..

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : మెక్సికోలోని సాల్టిల్లోలో జరిగిన ఆర్చరీ ప్రపంచ కప్‌ ఫైనల్‌-2026లో చరిత్రాత్మక విజయం సాధించిన ధీరజ్‌ బొమ్మదేవరకు ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారా లోకేశ్‌ అభినందనలు తెలిపారు. ధీరజ్‌ గెలుపు ఆంధ్రప్రదేశ్‌ క్రీడా కీర్తి పతాకాన్ని ప్రపంచ వేదికపై రెపరెపలాడించిందని కొనియాడారు. అంకితభావం, పట్టుదల, క్రమశిక్షణ, కఠోర సాధనతో స్వర్ణ పతకం సాధించిన ధీరజ్‌ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.

మెక్సికోలోని సాల్టిల్లోలో జరిగిన ఆర్చరీ ప్రపంచ కప్‌ ఫైనల్‌-2026లో భారత ఆర్చర్‌ ధీరజ్‌ బొమ్మదేవర చరిత్ర సృష్టించారు. పురుషుల రికర్వ్‌ వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకం సాధించి ఈ ఘనత సాధించిన తొలి భారత పురుష ఆర్చర్‌గా రికార్డు నెలకొల్పారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 10వ స్థానంలో ఉన్న ధీరజ్‌.. ఫైనల్‌ పోరులో జపాన్‌కు చెందిన నకనిషి జున్యాపై ఉత్కంఠభరిత విజయం సాధించారు. ఐదు సెట్ల పాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ఇద్దరూ 5-5తో సమంగా నిలిచారు.

అనంతరం జరిగిన షూట్‌ఆఫ్‌లో ధీరజ్‌ 10-9తో విజయం సాధించి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. దీంతో ప్రపంచ కప్‌ ఫైనల్‌లో పురుషుల రికర్వ్‌ విభాగంలో స్వర్ణం సాధించిన తొలి భారత ఆర్చర్‌గా చరిత్ర సృష్టించారు. 25 ఏళ్ల ధీరజ్‌ ఈ టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబరిచారు. క్వార్టర్‌ ఫైనల్స్‌, సెమీఫైనల్స్‌లో ఆధిపత్యం ప్రదర్శించి ఫైనల్‌కు చేరుకున్న ఆయన.. తుదిపోరులో ఒత్తిడిని అధిగమించి విజేతగా నిలిచారు.

ఈ విజయంతో ప్రపంచ కప్‌ ఫైనల్‌లో పురుషుల రికర్వ్‌ విభాగంలో భారత ఆర్చర్‌ పతకం సాధించేందుకు ఎదురుచూస్తున్న 16 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. అంతకుముందు 2010లో ఎడిన్‌బర్గ్‌లో జరిగిన ప్రపంచ కప్‌ ఫైనల్‌లో జయంత తాలూక్దార్‌ కాంస్య పతకం సాధించారు.

ప్రపంచ కప్‌ ఫైనల్‌లో వ్యక్తిగత స్వర్ణం సాధించిన రెండో భారత ఆర్చర్‌గా కూడా ధీరజ్‌ నిలిచారు. 2007లో దుబాయ్‌లో జరిగిన ప్రపంచ కప్‌ ఫైనల్‌లో మహిళల వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించిన దోలా బెనర్జీ తర్వాత ఈ ఘనత సాధించిన భారత ఆర్చర్‌గా ధీరజ్‌ రికార్డు సృష్టించారు.