సేవలు మెరుగు పర్చుకోవాలి.. వైద్య సిబ్బందితో సమీక్ష
నర్సాపురం, ఆంధ్రప్రభ: వైద్య సేవలు మెరుగు పర్చుకోవాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని నర్సాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్ డీ ఓ) దాసి రాజు వైద్య సిబ్బందికి సూచించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి లో గురువారం ఉదయం డీసీహెచ్ ఎస్ అధికారితో కలిసి వైద్య సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న సేవలు, వైద్య పరీక్షలు, ఉచిత మందులు పంపిణీ, శానిటేషన్, సెక్యూరిటీ పని తీరు, ఓ పి విభాగం తదితర అంశాలను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చిన ప్రజలను వైద్య సేవలు పై ఆరా తీశారు.
అనంతరం నిర్వహించిన సమీక్షా సమావేశంలో పలు విషయాలు చర్చించి వివిధ సూచనలు చేశారు. జిల్లాలో నర్సాపురం ప్రభుత్వ ఆసుపత్రి సేవలు అందించడంలో వెనుకంజలో ఉన్నట్లు ప్రభుత్వ నివేదికలో ఉందన్నారు. ప్రజా వైద్యశాల ద్వారా ప్రజలకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించాలని, ఆసుపత్రి కి వచ్చే రోగులు పట్ల మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని, మందులను బయట మెడికల్ స్టార్ లో కొనుగోలు చేసుకోమని చెప్పరాదని , ఆసుపత్రి ఆవరణ, పరిసరాలు పరి శుభ్రంగా ఉంచాలని సూచించారు. ఆసుపత్రి కి వచ్చే ఓపీ సంఖ్య పెరగాలన్నారు.
కింది స్థాయి సిబ్బంది నుంచి వైద్యులు వరకు తమ సేవలను విస్తృతం చేయాలని, ప్రజలకు సంతృప్తికరమైన సేవలు అందించి జిల్లాలో ముందుంజ లో ఉండాలని ఆర్ డి ఓ ఆశాభావం వ్యక్తం చేశారు. డీసీహెచ్ఎస్ అధికారి సీహెచ్ సూర్య నారాయణ మాట్లాడుతూ.. అందించాల్సిన వైద్య సేవలు , అందుతున్న సేవలు గురించి వివరించారు. ఈ సమావేశం లో తహసీల్దార్ నాగార్జున, ఆసుపత్రి సూపరెండెంట్ డాక్టర్ ఆర్ సంతోష్ కుమార్, వైద్యులు రామక్రిష్ణ, సుప్రియ, అభివృద్ధి కమిటీ సభ్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
